
TVK MLA : తమిళనాడు రాజకీయాల్లో ప్రాజెక్ట్ మేఘాలయ అనే పేరుతో జరిగిన కుట్ర కలకలం రేపుతోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిగిన ప్రయత్నంగా దీనిని పోలీసులు భావిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు భారీగా లంచాలు ఎరజూపి, పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించాలని కొందరు కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు బయటపడింది. యూట్యూబర్ తిరునావుక్కరసు అతని బృందం తనను కలిసి, పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ. 35 కోట్లు ఇస్తామని ఆశ చూపారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తాను తిరస్కరించడంతో తనను, తన కుటుంబాన్ని బెదిరించారని కూడా ఆయన పేర్కొన్నారు. సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ఇలాగే ప్రలోభపెట్టాలని ప్రాజెక్ట్ మేఘాలయ పేరుతో ప్లాన్ వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Also Read : BIG BREAKING : విక్రమ్-1 ప్రయోగం సక్సెస్!
ఈ కేసులో భాగంగా పుతియ తలైమురై ఛానల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు విజయన్‌ను పోలీసులు విచారించారు. ప్రధాన నిందితుడు తిరునావుక్కరసుతో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆధారాలు దొరకడంతో, విచారణ చేసి అతని మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. అయితే, ఇది పత్రికా స్వేచ్ఛను అణచివేయడమేనని చెన్నై ప్రెస్ క్లబ్ పోలీసుల చర్యను తప్పుబట్టింది. పోలీసులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మాజీ డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని, ఆయన సోదరుడు అశోక్‌ను కూడా విచారణకు రావాలని పోలీసులు కోరారు. అయితే, తమపై వస్తున్న ఆరోపణలను డీఎంకే తోసిపుచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే టీవీకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని, చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటామని డీఎంకే స్పష్టం చేసింది.
Also Read : బద్రీనాథ్ విరాళాల కుంభకోణం: మాజీ అధికారి అరెస్ట్!









