Actress Sameera Reddy
Actress Sameera Reddy

ఒకప్పుడు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌, రానాతో పలు సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి.. తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై.. ఎవరూ ఊహించని విధంగా మారిపోయారు. కేవలం ఏడాదిలోనే 100 కేజీల బరువు పెరిగి గుర్తు పట్టలేనంతగా అయిపోయారు. ఇదే విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’, ఎన్టీఆర్‌తో ‘అశోక్’, ‘నరసింహుడు’, రానాతో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి సినిమాలలో నటించిన సమీరా తన అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. గ్లామర్స్ రోల్‌లో అదరగొట్టిన ఈ బ్యూటీ.. తన పెళ్లి తర్వాత ఎన్నో విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.

2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న సమీరా రెడ్డి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2015లో హన్స్ అనే కుమారుడు, 2019లో నైరా అనే కుమార్తె జన్మించారు. ఆ తర్వాత కొన్నేళ్లు సినిమాలు దూరమయ్యారు. ఇక తన కుమారుడు పుట్టిన తర్వాత చాలా డిప్రెషన్, హార్మోన్ల సమస్యలు, వేగంగా బరువు పెరగడం వంటి వాటితో పూర్తిగా కుంగిపోయానని ఆమె తెలిపారు. ఏడాదిలోనే 100 కేజీల బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. ఒకానొక సమయంలో తన కెరీర్, జీవితం రెండు ముగిసిపోతాయని తనకు అనిపించిందని వెల్లడించారు.

ఆ సమయంలో తీవ్రమైన హార్మోన్ల సమస్యలు వచ్చాయని, తన జీవితంలో ఇదే అత్యంత భారమైన దశ అని అనిపించినట్లు పేర్కొన్నారు. ఇక అదే సమయంలో కూరగాయల వ్యాపారి సైతం తనను హేళన చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ‘‘దీదీ మీకేమైంది? ఇంత లావు ఎలా అయ్యారు?’’ అని అడిగేవారని ఆమె చెప్పారు. మరికొందరు అయితే ‘‘అరే ఈమెనేనా సమీరా రెడ్డి? ఈమె ఒకప్పుడు సినిమా హీరోయిన్ కదా? ఈమెకు ఏమైంది?’’ అని అనేవారని ఆమె తెలిపారు.

అదే విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. తాను అప్పట్లో బాగా బరువు పెరిగానని, అయితే ఈ రోజు దాని గురించి చెప్పటానికి తాను సిగ్గుపడటం లేదని చెప్పారు. తన భర్త సలహా తనకు ఎంతగానో సహాయపడిందని తెలిపారు.

తన భర్త అక్షయ్ ఏమన్నారో వివరించారు. ‘‘నిన్ను విమర్శిస్తున్నందుకు అందరినీ నిందించలేవు. ఎందుకంటే ప్రజల కోసం ‘సెక్సీ సామ్’ అనే ఇమేజ్‌ను సృష్టించింది నువ్వే. వాళ్ళు నిన్ను ఎప్పుడూ ఒక గ్లామరస్ రూపంలోనే చూశారు. ఇప్పుడు నువ్వు అకస్మాత్తుగా మారిపోయావు కాబట్టి నిన్ను అడుగుతారు. నువ్వు ప్రజలను మార్చలేవు.. అలాగే వారి ఆలోచనలను కంట్రోల్ చేయలేవు. కాబట్టి ఇతరులను మార్చడానికి ప్రయత్నించడానికి బదులుగా.. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీరు ఎలా ఉన్నా.. మీతో స్నేహం చేసేవారితోనే ఉండండి. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఇదే ఉత్తమ మార్గం.’’ అని తన భర్త చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత భర్త సలహా మేరకు తాను అన్నింటిని పట్టించుకోవడం మానేశానని, ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని తెలిపారు.