HEAVY RAIN ALERT TOMORROW
HEAVY RAIN ALERT TOMORROW

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న భారీ వర్షాలు.. రేపటి నుంచి ఎడతెరపి లేకుండా కురవనున్నట్లు పేర్కొంది. అలాగే పర్వత ప్రాంతల్లో కొండచరియలు విరిగిపడే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయో తెలుసుకుందాం.

వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.

ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో రేపు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే గంటకు 20 నుంచి 30 కి.మీ వేగంతో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే ఉత్తరప్రదేశ్‌లో సైతం రేపటి నుంచి వర్షాలు కురవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. అదే సమయంలో వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదముందని పేర్కొంది. జూలై 22 వరకు ఇలాగే కొనసాగనుందని తెలిపింది.

బీహార్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నట్లు ఐఎండీ పేర్కొంది. రేపు అతి భారీ వర్షాలు పడనుండటంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదముందని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లో కూడా రేపు వర్షాలు బీభత్సం సృష్టించబోతున్నట్లు ఐఎండీ తెలిపింది. పూంచ్, రాజౌరి, పహల్గామ్, బల్తాల్ అండ్ జమ్మూ ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పవిత్ర యాత్రలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఇక్కడ రెడ్ అలర్ట్ అమలులో ఉంది.

వీటితో పాటు వాతావరణ శాఖ మరికొన్ని ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జూలై 22 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.