BJP MP : హిందూ యువత పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలని బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్‌ పటేల్‌ సూచించారు. జనాభా పెరుగుదల, పుట్టే పిల్లల సంఖ్యను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నలుగురు పిల్లలు పుడితే అందులో ఒకరు హిందూ కుటుంబానికి చెందినవారు కాగా.. ముగ్గురు మరో వర్గానికి చెందినవారిగా ఉంటున్నారని పటేల్‌ చెప్పారు. 1947 నుంచి 1967 మధ్య పరిస్థితి వేరుగా ఉండేదని, స్వాతంత్య్రం తర్వాత, ముఖ్యంగా 2011 జనగణన నాటికి ఒక వర్గం జనాభా వాటా తగ్గగా.. మరో వర్గం వాటా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

జనాభా రేటును ప్రస్తావిస్తూ ఒక వర్గంలో 1.9 శాతం, మరో వర్గంలో 2.9 శాతం ఉందని పటేల్‌ చెప్పారు. అయితే ఆయన ప్రస్తావించిన ఈ గణాంకాలు ఏ డేటా ఆధారంగా చెప్పారన్నది స్పష్టంగా లేదు. 1947 నుంచి 1967 మధ్య పుట్టినవారు సాధారణంగా పెద్ద కుటుంబాల్లో పెరిగారని పటేల్‌ అన్నారు. అప్పట్లో నాలుగు, ఐదు, ఆరు, ఏడు మంది పిల్లలు ఉండటం సాధారణంగా ఉండేదని చెప్పారు. అప్పట్లో 20, 21 లేదా 22 ఏళ్లకే పెళ్లిళ్లు జరిగేవని.. ఇప్పుడు 30, 35, 37 ఏళ్లకు పెళ్లిళ్లు చేసుకుంటూ ఒకే బిడ్డను కంటున్నారని అన్నారు.

ఇదే కారణంగా సనాతనీల జనన రేటు 1.9గా ఉందని పటేల్‌ పేర్కొన్నారు. యువత పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురు పిల్లలను కనాలని సూచించారు. సమాజాన్ని, కుటుంబాలను బలోపేతం చేయడానికి జిమ్‌లు, సంప్రదాయ కుస్తీ శిక్షణ కేంద్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడబోనని.. తాను సనాతనినని పటేల్‌ అన్నారు. తన ప్రాంతానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజన్‌ మండ్లోయ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. దేశంలో కష్టాలు వచ్చినప్పుడు సనాతనీలు ఒకరికొకరు అండగా నిలుస్తారని, కాంగ్రెస్‌ లేదా బీజేపీ కంటే తమ మధ్య ఐక్యత ముఖ్యమని ఆయన అన్నారు.

అమ్మవారిపై భక్తితో పాటు సమాజంలో బలం కూడా అవసరమని పటేల్‌ చెప్పారు. ఆయుధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వాడకంపై కూడా పటేల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆడంబరంగా ఖర్చు చేసే అలవాటు పెరుగుతోందని అన్నారు. తన ‘3డీ’ ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. డీజేలు, డ్రగ్స్‌, వరకట్నం వంటి అంశాలపై సమాజం దృష్టి పెట్టాలని సూచించారు. డీజేలతో జరిగే కార్యక్రమాల్లో నృత్యం చేసే యువతలో దాదాపు 100 శాతం మంది సనాతనీలేనని, వారిలో 60 శాతం మంది మత్తు పదార్థాల ప్రభావంలో నృత్యం చేస్తున్నారని పటేల్‌ అన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని యువత, సమాజం మార్పు దిశగా పనిచేయాలని ఆయన కోరారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.