
Badrinath Temple : బద్రీనాథ్ ధామ్ ఆలయ విరాళాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ మాజీ అధికారి రాజేంద్ర చౌహాన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.
శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ వేసిన నలుగురు సభ్యుల విచారణ కమిటీ 18 పేజీల నివేదికను సమర్పించిన మరుసటి రోజే ఈ అరెస్టు జరగడం గమనార్హం. విరాళాల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేయాలని, లెక్కింపు కేంద్రంతో పాటు ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆ కమిటీ సూచించింది.
Also Read : BIG BREAKING : విక్రమ్-1 ప్రయోగం సక్సెస్!
ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే BKTC చైర్మన్ కార్యాలయంలో పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రమోద్ నౌటియాల్‌ను కమిటీ నివేదిక ఆధారంగా అధికారులు సస్పెండ్ చేశారు. నౌటియాల్‌పై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. చమోలీ డీఎస్పీ మదన్ సింగ్ నేతృత్వంలోని SIT బృందం నౌటియాల్ గత కార్యకలాపాలపై నిశితంగా పరిశీలిస్తోంది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజీని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. వీటితో పాటు, BKTC ట్రెజరర్ సందేశ్ మెహతాను బదిలీ చేసి, ఆయన స్థానంలో కేదార్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాళాలను దొంగిలించడం అనేది తల్లిదండ్రులను చంపడంతో సమానమైన పాపమని, నేరం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. అధికార పక్షం నియమించిన వ్యక్తులే ఆలయంలోని నగలు, విరాళాల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకుడు గణేష్ గోడియాల్ డిమాండ్ చేశారు.
Also Read : విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర… TVK MLAలకు రూ. 35 కోట్ల ఆశ!









