PV Sindhu victory Japan Open Super 750 (1)
PV Sindhu victory Japan Open Super 750 (1)

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించారు. ఇవాళ జరిగిన ‘జపాన్ ఓపెన్ సూపర్ -750’ (Japan Open Super 750) టోర్నీలో విజేతగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు 21-17, 21-17తో ప్రత్యర్థి అకానె యమగూచిపై రెండు గేముల్లోనూ వరుస విజయం సాధించి ఈ ఘనత సాధించారు. గత ఏడాది నుంచి సింధూ ఒక్క విజయం లేక అల్లాడిపోయారు. ఇక ఈ టోర్నీతో సింధూకి ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా భారత్ తరపున జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె ఈ ఘనత సాధించడంతో పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు తాజాగా పీవీ సింధూ ఘనతపై స్పందించారు. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్ గెలుచుకోవడంపై ప్రశంసలు కురిపించారు. సొంత గడ్డపై ప్రత్యర్థి అకానె యమగుచిపై అద్భుత విజయం సాధించిన సింధూకు అభినందనలు తెలిపారు. ఇది భారతీయ బ్యాడ్మింటన్‌కు కీలక, చారిత్రాత్మక మైలురాయి అని కొనియాడారు.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సింధూ ఘనతను అభినందించారు. జపాన్ ఓపెన్ సూపర్ 750 (Japan Open Super 750) టోర్నీలో అద్భుత విజయాన్ని సాధించినందుకు గానూ పీవీ సింధూకి అభినందనలు తెలిపారు. ప్రత్యర్థి అకానె యమగూచిను ఆమె సొంత గడ్డపైనే ఓడించడం పట్ల సింధూ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. జపాన్ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలిగా నిలిచి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఈ అద్భుత విజయం మరెన్నో చారిత్రాత్మక విజయాలకు ఆరంభం కావాలని తెలిపారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం పీసీ సింధూ విజయంపై ప్రశంసలు కురిపించారు. అకానె యమగుచిపై సింధూ 21-17, 21-17 తేడాతో అద్భుతమైన విజయం సాధించి.. తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారని కొనియాడారు. ఆమెను ఆపడం అసాధ్యమని.. ఇలాగే కొనసాగించాలని తెలిపారు.