coronavirus

Corona Virus :  దేశంలో మళ్లీ కోవిడ్-19 కేసులు స్వల్పంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఏపీతో పాటు కొన్ని నగరాల్లో కేసులు, మరణాలు నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, గతంలో మనం చూసిన భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు లేవని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం కేసులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి తప్ప, దేశవ్యాప్తంగా వ్యాపించలేదు. ఆసుపత్రులపై తీవ్రమైన ఒత్తిడి లేదా ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు కూడా ఎక్కడా కనిపించడం లేదు.

Also Read : విక్రమ్‌-1 ప్రయోగం సక్సెస్!

గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉందంటే, టీకాల ద్వారా, గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ల వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగింది. దీనివల్ల ఆరోగ్యవంతులకు కోవిడ్ సోకినా తీవ్రత తక్కువగానే ఉంటోంది. ఇప్పుడు కోవిడ్ కూడా సాధారణ ఫ్లూ లేదా ఇతర శ్వాసకోశ సమస్యల మాదిరిగానే మారుతోంది. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, నీరసం లేదా రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని, ఇతరులకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలితే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ, తగినంత విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకోవాలి. అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తగ్గని జ్వరం లేదా ఛాతీలో నొప్పి ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం, గుండె, మూత్రపిండాలు లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీరికి వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లినప్పుడు చేతులను సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడటం, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో లేదా ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మంచిది. అలాగే, గాలి వెలుతురు ఉండేలా చూసుకోవడం, వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బాధ్యతగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ ముప్పు నుండి సురక్షితంగా బయటపడవచ్చు.

Also Read : రంగుల పాపడ్‌లతో క్యాన్సర్ ముప్పు.. తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.