Meerut Murder Case: సమాజంలో రోజురోజుకూ మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. నూరేళ్ల బంధంతో తోడుంటానని ప్రమాణం చేసిన భార్యే, పరాయి వ్యక్తి మోజులో పడి భర్త ప్రాణాలను తీయడానికి వెనుకాడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్న ఈ కిరాతక ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఒక భార్య తన ప్రియుడితో కలిసి పాము కాటుతో భర్తను హతమార్చిన వైనం పోలీసుల దర్యాప్తులో తేలింది.

Also Read : పెరుగుతున్న కరోనా కేసులు: మళ్లీ మాస్క్ ధరించాల్సిందేనా? డాక్లర్లు ఏం అంటున్నారంటే?

పోలీసుల కథనం ప్రకారం.. భందోరా గ్రామానికి చెందిన అతుల్ పన్వార్ (35), దామిని అనే మహిళను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి హస్తినాపూర్‌లో ‘కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్’ అనే ప్రైవేట్ పాఠశాలను విజయవంతంగా నిర్వహిస్తూ పచ్చగా జీవిస్తున్నారు. అయితే, వీరి పాఠశాలలోనే బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అనే యువకుడితో దామినికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీయడంతో, వారి పచ్చని సంసారంలో చిచ్చు రేగింది.

భర్త అతుల్ బతికుంటే తామిద్దరూ కలిసి జీవించడం సాధ్యం కాదని దామిని, తుషార్ భావించారు. ఎలాగైనా అతుల్‌ను అడ్డుతప్పించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అతుల్ పేరు మీద ఉన్న రూ. 20 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ (బీమా) సొమ్మును కూడా కాజేయవచ్చని, ఆ డబ్బుతో తామిద్దరూ హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వచ్చని ఒక క్రూరమైన పథకానికి తెరలేపారు. ఈ క్రమంలోనే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ‘స్నేక్ మర్డర్’ (పాముతో హతమార్చడం) ప్లాన్ చేశారు.

వాస్తవానికి అతుల్‌ను చంపడానికి వారు ఇదివరకు కూడా ఒక ప్రయత్నం చేశారు. సరిగ్గా 20 రోజుల క్రితం, అతుల్ బయటకు వెళ్లిన సమయంలో అతడిని కారుతో బలంగా ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించి చంపాలని ప్రియుడు తుషార్ ప్రయత్నించాడు. కానీ, అదృష్టవశాత్తూ ఆ సమయంలో అతుల్ తలకు హెల్మెట్ ధరించి ఉండటం వల్ల స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో, ఈసారి మరింత పక్కాగా, సాక్ష్యాలు దొరకని రీతిలో విషసర్పంతో దాడి చేయాలని నిర్ణయించారు.

ఈ ఘాతుకానికి పాల్పడేందుకు డ్రైవర్ తుషార్.. సోను, ఉదయ్‌ అనే ఇద్దరు పాములు పట్టే వ్యక్తుల సాయం తీసుకున్నాడు. విషపూరితమైన పామును తెచ్చి ఇచ్చినందుకు వారికి రూ. 5 లక్షల సుపారీ (అంగీకార సొమ్ము) ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం వారు ఒక ప్రమాదకరమైన విషసరాన్ని సంపాదించి, ఒక డబ్బాలో బంధించి తుషార్‌కు అందించారు. ఈ విషయాన్ని తుషార్ తన మొబైల్ ద్వారా దామినికి చేరవేస్తూ, హత్యకు సమయం కోసం వేచి చూశాడు.

Also Read : విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర… TVK MLAలకు రూ. 35 కోట్ల ఆశ!

గత గురువారం రాత్రి ఈ దారుణానికి సమయం ఆసన్నమైంది. దామిని పథకం ప్రకారం భర్త అతుల్ రాత్రి తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే అతుల్ మంచంపై స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అతుల్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని నిర్ధారించుకున్న దామిని.. వెంటనే ప్రియుడు తుషార్‌కు ఫోన్ చేసింది. తుషార్ తన అనుచరులతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా అతుల్ గదిలోకి ప్రవేశించి, తాము తెచ్చిన విషసరాన్ని అతుల్ కప్పుకున్న దుప్పటి కింద వదిలేశారు. ఆ పాము అతుల్‌ను తీవ్రంగా కాటేయడంతో అతడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు.

మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లు నటిస్తూ దామిని పెద్దగా కేకలు వేసింది. భర్తను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంచంపై పాము కూడా లభించడంతో అందరూ అది సాధారణ పాము కాటు మరణమేనని నమ్మారు. అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న హస్తినాపూర్ పోలీసులకు అక్కడి పరిస్థితులు, దామిని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. మరణించిన తీరు సహజంగా లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు సాంకేతిక విశ్లేషణలో భాగంగా దామిని, డ్రైవర్ తుషార్‌ల మొబైల్ కాల్ డేటాను పరిశీలించగా, వారిద్దరూ నిరంతరం మాట్లాడుకున్నట్లు తేలింది. మరింత లోతుగా విచారించి తుషార్ మొబైల్‌ను తనిఖీ చేయగా.. అందులో ‘డబ్బాలో బంధించిన పాము ఫోటో’ లభ్యమైంది. ఇదే ఈ కేసులో అత్యంత కీలకమైన డిజిటల్ ఆధారంగా మారింది. పోలీసుల శైలి విచారణలో నిందితులు ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారు. దీంతో మీరట్ ఎస్ఎస్పీ అవినాష్ పాండే ఆదేశాల మేరకు భార్య దామిని, ప్రియుడు తుషార్‌లతో పాటు, వారికి సహకరించిన పాములు పట్టే సోను, ఉదయ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.