China News: చైనా తమ సరికొత్త, అత్యంత శక్తివంతమైన ‘హై-పవర్ మైక్రోవేవ్’ (HPM) ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడించింది. ఈ అత్యాధునిక వ్యవస్థ దాదాపు 100 గిగావాట్ల (GW) వరకు మైక్రోవేవ్ శక్తిని ఉత్పత్తి చేయగలదని చైనా రక్షణ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అవసరమైతే భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలోని (Low-Earth Orbit) ఉపగ్రహాలు, డ్రోన్లు ,శత్రు దేశాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ఇది నిమిషాల్లో నిర్వీర్యం చేయగలదు. ఈ సాంకేతికత భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ బ అంతరిక్ష యుద్ధాల రూపురేఖలనే మార్చేస్తుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

Also Read : తిరుమలలో మళ్లీ చిరుత హల్‌చల్: భయంతో పరుగులు తీసిన భక్తులు!

గడిచిన కొన్నేళ్లలో పల్స్డ్-పవర్ సాంకేతికతలో (Pulsed-Power Technology) చైనా వేగవంతమైన పురోగతిని సాధించింది. ఈ విభాగంలో తాము ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నామని, దీనికి సంబంధించిన కీలక ప్రయోగాలను (Testing) కూడా విజవంతంగా పూర్తి చేశామని చైనా ప్రకటించింది. ఇప్పటికే అనేక గిగావాట్ల సామర్థ్యం కలిగిన మైక్రోవేవ్ ఆయుధాలను చైనా అభివృద్ధి చేసి, అందులో కొన్నింటిని తమ సైన్యానికి కూడా అందజేసింది. బహుళ హై-పవర్ పల్స్ జనరేటర్లను ఒకేసారి అనుసంధానించడం ద్వారా రూపొందించిన ఈ 100 గిగావాట్ల సిస్టమ్, అత్యంత బలమైన మైక్రోవేవ్ కిరణాలను విడుదల చేస్తుంది.

ఈ సాంకేతికతను ఉపగ్రహ నిరోధక ఆయుధంగా (Anti-Satellite Weapon) ఉపయోగిస్తే, స్టార్‌లింక్ వంటి లో-ఎర్త్ ఆర్బిట్‌లోని ఖరీదైన శాటిలైట్ నెట్‌వర్క్‌లకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. సాధారణంగా 1 గిగావాట్ మైక్రోవేవ్ పల్స్ కూడా ఒక ఉపగ్రహంలోని ఎలక్ట్రానిక్ భాగాలను పూర్తిగా ధ్వంసం చేయగలదు. అలాంటప్పుడు 100 గిగావాట్ల సామర్థ్యం ఉన్న ఆయుధం శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థను క్షణాల్లో తుడిచిపెట్టగలదని భావిస్తున్నారు.

దీంతోపాటు, చైనా శాస్త్రవేత్తలు ‘లిథియం-అయాన్ కెపాసిటర్ హైబ్రిడ్ సిస్టమ్’ అనే నూతన సాంకేతికతను కూడా అభివృద్ధి చేశారు. ఇది మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా తక్షణమే పనిచేసి నిరంతరం విద్యుత్ శక్తిని అందిస్తుంది. దీనివల్ల మంచు ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలలో కూడా చైనా తన ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాన్ని సమర్థవంతంగా ప్రదర్శించగలుగుతుంది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను మరింత చిన్నదిగా, చౌకగా, అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసేలా రూపాంతరం చేసి వివిధ సైనిక వేదికలపై మోహరిస్తామని చైనా పేర్కొంది.

Also Read : కడపలో మళ్లీ కరోనా కలకలం: రిమ్స్‌లో రెండు కేసులు నమోదు, వైద్యారోగ్య శాఖ గోప్యతపై ప్రజల ఆగ్రహం!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.