Tirumala :  కలియుగ వైకుంఠం తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు మరోసారి చిరుత పులి చుక్కలు చూపించింది. అలిపిరి నడకమార్గంలో అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షం కావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాలిగోపురాన్ని దాటి ముందుకు వెళ్తున్న సమయంలో నడకదారిపై చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఎటువైపు నుంచి తమపై దాడి చేస్తుందోనన్న భయంతో భక్తులు గట్టిగా కేకలు వేస్తూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. భక్తులందరూ ఒకేసారి పెద్దగా అరుస్తూ గుంపులుగా చేరడంతో, ఆ శబ్దాలకు భయపడిన చిరుత మెట్ల మార్గాన్ని వదిలి పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి పారిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : కడపలో మళ్లీ కరోనా కలకలం: రిమ్స్‌లో రెండు కేసులు నమోదు, వైద్యారోగ్య శాఖ గోప్యతపై ప్రజల ఆగ్రహం!

Also Read : మమతకు ఈడీ బిగ్ షాక్…టీఎంసీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్

చిరుత నడకదారిపైకి వచ్చిన దృశ్యాలను కొందరు భక్తులు తమ ఫోన్లలో రికార్డ్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు, టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించారు. భక్తుల భద్రత దృష్ట్యా నడకమార్గంలో నిఘాను, రక్షణ చర్యలను మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు.

రెండు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే వరుసగా చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చి భక్తులను భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి కొన్ని చిరుతలను బంధించారు. ఆ సమయంలోనే టీటీడీ కూడా భక్తుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు సూచించింది. నడకదారిలో ఒంటరిగా వెళ్లకుండా ఎప్పుడూ గుంపులుగా ప్రయాణించాలని, తమ వెంట రక్షణగా కర్రలను ఉంచుకోవాలని భక్తులకు అప్పట్లో జారీ చేసిన ఆదేశాలను అధికారులు మరోసారి గుర్తు చేస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.