
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అధికారిక రాజకీయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాలపై ఈడీ అధికారులు విరుచుకుపడ్డారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆ పార్టీకి చెందిన మూడు ప్రధాన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 440.42 కోట్ల భారీ డిపాజిట్లను స్తంభింపజేస్తూ (ఫ్రీజ్) మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈడీ చేపట్టిన సైబర్ నేరాలు ,విదేశీ నిధుల అక్రమ మళ్లింపు దర్యాప్తులో భాగమే ఈ చర్యలు అని వెల్లడైంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఓ భారీ సైబర్ ఫ్రాడ్ ద్వారా వచ్చిన అక్రమ సొమ్ము, వివిధ మార్గాల ద్వారా టీఎంసీ అధికారిక బ్యాంక్ ఖాతాల్లోకి చేరినట్లు వచ్చిన తీవ్రమైన ఆరోపణల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. నిధుల ప్రాథమిక మూలాలను, వాటి వెనుక ఉన్న సంక్లిష్ట నెట్‌వర్క్‌ను ఛేదించే క్రమంలో ఈడీ సోదాలు వేగవంతం చేసింది.
కేసు విచారణలో భాగంగా మంగళవారం రోజున ఈడీ అధికారులు కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లోని 5 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. వీటిలో చార్టర్డ్ విమానాలు, ప్రైవేట్ ఏవియేషన్ సేవలు అందించే ‘కేర్‌వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కార్యాలయాలు, దానికి సంబంధించిన గ్రూప్ కంపెనీల ప్రాంగణాలు ఉన్నాయి. ఈ సోదాల్లో సంచలనాత్మక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఈడీ ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 2023 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో టీఎంసీ ఖాతాల నుంచి సుమారు రూ. 160 కోట్లను కేర్‌వెల్ ఏవియేషన్‌కు, దాని అనుబంధ సంస్థలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. అనంతరం అందులోంచి రూ. 82.96 కోట్లను మరో షెల్ కంపెనీకి మళ్లించారు. ఈ నిధులతో రూ. 112 కోట్ల భారీ వ్యయంతో ఒక ‘ఎంభ్రేయర్ లీగసీ 600’ ప్రైవేట్ విమానం, , ఒక ‘అగస్టా 109 ఎస్‌పీ’ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు.
అయితే ఇక్కడే అసలు నిధుల మళ్లింపు కోణం వెలుగుచూసింది. అక్రమ నిధులతో కొనుగోలు చేసిన సదరు ప్రైవేట్ విమానం హెలికాప్టర్‌ను, కేర్‌వెల్ సంస్థ తిరిగి అత్యధిక లీజు ధరకు టీఎంసీకే అద్దెకు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. పార్టీ నాయకుల ప్రచారం కోసం వీటిని ఉపయోగిస్తూ, ఆ అద్దె రూపంలో మళ్లీ భారీ మొత్తాలను చెల్లించే వ్యూహాన్ని అమలు చేశారని, అసలు లబ్ధిదారులను దాచిపెట్టేందుకు ఈ వింత మార్గాన్ని ఎంచుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారం వెనుక కేవలం లోకల్ నిధులే కాకుండా, హెలికాప్టర్,విమాన కొనుగోలుకు విదేశీ నిధులు ఏమైనా వినియోగించారా అనే దిశగా కూడా ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. కాగా, టీఎంసీ పార్టీకి చెందిన కొందరు రెబల్ ఎమ్మెల్యేలు గతంలోనే ఈ నిధుల అక్రమ మళ్లింపుపై పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీలో అంతర్గత విబేధాలతో సతమతమవుతున్న టీఎంసీకి ఈ తాజా ఈడీ చర్యలు కోలుకోలేని దెబ్బగా మారాయి.
బ్యాంక్ ఖాతాలు హఠాత్తుగా ఫ్రీజ్ కావడంతో తమ పార్టీ రోజువారీ కార్యకలాపాలు, సిబ్బంది జీతభత్యాలు, ఇతర అత్యవసర ఖర్చులకు తీవ్ర విఘాతం కలుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం ఆందోళన చెందింది. ఈడీ తీసుకున్న ఈ చర్యను సవాలు చేస్తూ టీఎంసీ వెంటనే కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. తమ ఖాతాలపై విధించిన ఆంక్షలను తక్షణమే తొలగించాలని కోర్టును అభ్యర్థించింది.
టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు ధర్మాసనం, పార్టీకి తాత్కాలిక ఊరట నిచ్చేలా కీలక తీర్పును వెలువరించింది. ఈడీ సేకరించిన ప్రాథమిక ఆధారాలు,పోలీసులు సమర్పించిన నివేదికలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక గుర్తించబడిన రాజకీయ పార్టీ రోజువారీ ఖర్చులకు నిధులు లేకుండా పూర్తిగా అడ్డుకోవడం సరికాదని భావిస్తూ, ఖాతాల ఫ్రీజింగ్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, హైకోర్టు ఈ ఊరటతో పాటు ఒక ముఖ్యాంశాన్ని జోడించింది. రోజువారీ ఖర్చుల కోసం పార్టీ నిధులను ఎలా వినియోగిస్తోందో నిశితంగా పరిశీలించడానికి ఒక ప్రత్యేక విచారణాధికారిని (అబ్జర్వర్) నియమించింది. కలకత్తా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుబ్రత తలుక్‌దార్‌ను పరిశీలకుడిగా నియమిస్తూ, ఆయన పర్యవేక్షణలోనే నిధుల వినియోగం జరగాలని ఆదేశించింది.
కలకత్తా హైకోర్టు తీర్పుతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, మనీలాండరింగ్ సైబర్ నేరాల కోణంలో ఈడీ జరుపుతున్న ప్రధాన దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు ఐఆర్జీసీ, ఈడీ వంటి కేంద్ర సంస్థల దాడులు, మరోవైపు ప్రతిపక్షాల విమర్శలతో బెంగాల్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
Also Read : తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీసీటీవీలో కనిపించిన కారుపై!









