
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు, మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల వల్ల ద్రోణి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, సికింద్రాబాద్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ సహా అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అటు ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు జాగ్రత్తలు వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read : దేశవ్యాప్తంగా ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు: ఉగ్ర కుట్రల మూలాలపై వేటు..
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాలకు పిడుగుల ముప్పు ఉందని తెలిపింది. వర్షం పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం పెరగడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉరుములు, మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
Also Read : తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీసీటీవీలో కనిపించిన కారుపై!









