Double Death Mystery: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఇద్దరు యువతీయువకుల అనుమానాస్పద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకవైపు ఆత్మహత్యలుగా కనిపిస్తున్న ఈ ఘటనలు, మరోవైపు హత్య ఆరోపణలు, వీటన్నింటికీ తోడు రక్తంతో రాసిన సందేశం.. వెరసి ఈ ఉదంతం ఒక పెద్ద మిస్టరీగా మారింది. వరుస బలవన్మరణాలతో మునుకుంట్ల గ్రామంలో ఒకే రాత్రి ఘోర విషాదం అలుముకుంది.

మునుకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (20) సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజూ స్వగ్రామం నుంచే కళాశాలకు వెళ్లి వచ్చే లక్ష్మీ ప్రసన్న.. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read : పరాయి బంధం మోజులో ఘోరం: భర్తను ‘పాము’తో కరిపించి చంపిన భార్య

లక్ష్మీ ప్రసన్న మృతి చెందిన కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం ఉదయం అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ (22) అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. లక్ష్మీ ప్రసన్న మరణ వార్త తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్.. రాత్రి గ్రామ శివారులోని ఒక తాటి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 24 గంటల వ్యవధిలో ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామం ఉలిక్కిపడింది.

గత కొంతకాలంగా లక్ష్మీ ప్రసన్న, రామ్ చరణ్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, వీరి వరుస మరణాలపై ప్రస్తుతం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రామ్ చరణ్ గత కొంతకాలంగా లక్ష్మీ ప్రసన్నను ప్రేమ పేరుతో తీవ్రంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీరి మరణాలకు అసలు కారణం ప్రేమ వ్యవహారమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెది ఆత్మహత్య కాదు.. చరణే లక్ష్మీ ప్రసన్న ఒంటరిగా ఉన్న సమయం చూసి హత్య చేశాడని తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. చరణ్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని లక్ష్మీ ప్రసన్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిని హత్య చేసిన అనంతరం ఆందోళనకు గురై చరణ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : అత్యాచారం చేశారు న్యాయం చేయమని వెళ్తే.. తిరిగి అత్యాచారం చేసిన లాయర్

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.