
Surat : సూరత్‌లో ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన అత్యాచార కేసులో న్యాయ చేస్తానని మాట ఇచ్చిన లాయర్, బాధితురాలి కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని అదే 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి దిందోలి ప్రాంతానికి చెందిన ప్రణయ్‌రాజ్ రణవీర్ (43) అనే ప్రాక్టీసింగ్ లాయర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బాధితురాలి తల్లిదండ్రులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గతంలో తన కుమార్తెపై జరిగిన అత్యాచార కేసు విషయంలో న్యాయం కోసం వారు రణవీర్‌ను ఆశ్రయించారు. ఆ సమయంలో అతను ఫీజు కింద రూ. 15,000 డిమాండ్ చేశాడు. ఆ డబ్బు కట్టే స్థోమత లేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో, తన ఇంట్లో పని మనిషిగా కుమార్తెను పంపిస్తే ఫీజు తీసుకోనని లాయర్ ప్రతిపాదించాడు.
Also Read : ప్రేమ, వేధింపులు, పగ.. మాదాపూర్లో యువకుడు దారుణ హత్య!
దీనికి అంగీకరించిన తల్లిదండ్రులు, బాలికను పని కోసం పంపారు. అయితే, బాలిక ఇంట్లో ఉన్న సమయంలో రణవీర్ ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే కోర్టులో నడుస్తున్న కేసును పాడు చేస్తానని బెదిరించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సచిన్ జిఐడిసి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారం, పోక్సో చట్టం, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ లాయర్ గతంలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. అహ్మదాబాద్‌లోని బావ్లాలో భార్యను వేధించడం, కట్నం కోసం వేధించడం వంటి కేసులతో పాటు, అహ్మదాబాద్, సూరత్‌లలో అల్లర్లతో పాటుగా మరికొన్ని కేసులు అతనిపై ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తూ, దర్యాప్తు వేగవంతం చేశారు.
గత సెప్టెంబర్ 2025లో ఈ బాలిక అపహరణకు గురవ్వగా, నవంబర్ 23న ఆమెను పోలీసులు గుర్తించారు. ఆ కేసులో అప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Also Read : నిర్మా సర్ఫ్ తో పాలు.. బయటపడ్డ దారుణం!









