Suicide :హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తేజస్విని (25) ఆత్మహత్య కలకలం రేపింది. విధుల్లో ఎదురైన తీవ్రమైన పని ఒత్తిడి ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం మానేసినప్పటికీ మానసిక ఒత్తిడి తట్టుకోలేక అర్థరాత్రి నగ్నంగా పరుగెట్టి పీర్జాదిగూడ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, దేవపల్లి గ్రామానికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్‌రావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని. చిన్న వయసులోనే మంచి ప్రతిభ కనబరిచిన ఆమె, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించింది. నెలవారీగా లక్షల రూపాయల జీతం తీసుకుంటూ కెరీర్‌లో విజయవంతంగా సాగుతున్న సమయంలో, విధుల్లో ఎదురైన తీవ్రమైన పని ఒత్తిడి ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ఆమె తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి, విశాఖపట్నానికి తిరిగి వచ్చేసింది.

ఉద్యోగం మానేసిన తర్వాత కూడా తేజస్విని మానసిక ప్రశాంతతను కోల్పోయింది. తరచూ పీడకలలు వస్తున్నాయని, తీవ్ర భయాందోళనలకు (ఫియర్ ఫోబియా) లోనవుతున్నానని కుటుంబ సభ్యులతో చెప్పేది. ఈ క్రమంలో కూతురికి మానసిక ఉపశమనం కలిగించేందుకు తల్లి అరుణ రెండు నెలల క్రితం ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వారు పీర్జాదిగూడలోని శంకర్‌నగర్‌ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. కాగా, తండ్రి ఈశ్వర్‌రావు విశాఖపట్నంలోనే ఉంటున్నారు. శుక్రవారం నాడు మరో మంచి గదిని అద్దెకు తీసుకోవడం కోసం తల్లి, కుమార్తె ఇద్దరూ కలిసి సాయంత్రం వరకు మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వెతికారు. రాత్రికి తిరిగి పీర్జాదిగూడలోని తమ నివాసానికి చేరుకుని నిద్రపోయారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:30 గంటల సమయంలో తేజస్వినికి తీవ్రమైన మానసిక ఆందోళన/ఫోబియా ఒక్కసారిగా ఎక్కువైంది. ఈ క్రమంలో ఆమె బెడ్‌రూమ్ నుండి బయటకు వచ్చి, తన తల్లి పడుకున్న గదికి బయట నుంచి తాళం వేసింది. ఆపై తీవ్ర ఉన్మాద స్థితిలో (మానసిక భ్రమల వల్ల) చేతిలో ఒక చీరను పట్టుకుని, ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా వీధిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. మార్గమధ్యంలో స్థానికంగా ఉన్న బీరప్ప గుడి వద్ద ఆగి, దేవుడికి దండం పెట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ పరుగెడుతూ వెళ్లి సమీపంలోని పీర్జాదిగూడ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అర్ధరాత్రి వేళ ఆమె నగ్నంగా రోడ్డుపై పరుగెత్తడం, గుడి వద్ద మొక్కడం వంటి విస్తుగొలిపే దృశ్యాలన్నీ స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

శనివారం ఉదయం నిద్రలేచిన తల్లి అరుణ.. బెడ్‌రూమ్ తలుపులకు బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించి గట్టిగా కేకలు వేశారు. పొరుగువారు వచ్చి తాళం తీసిన తర్వాత కూతురి కోసం చుట్టుపక్కల వెతికారు. చివరకు పీర్జాదిగూడ చెరువులో తేజస్విని మృతదేహాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, హైడ్రా (HYDRAA),డీఆర్‌ఎఫ్ (DRF) సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె తీవ్రమైన మానసిక సమస్యలు, భయాందోళనల (ఫియర్ ఫోబియా) వల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.