
Narendra Choudary : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ NTV వ్యవస్థాపకుడు తుమ్మల నరేంద్ర చౌదరి చిక్కుల్లో పడ్డారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికలకు సంబంధించి జరిగిన ఫోర్జరీ కేసులో ఆయనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నరేంద్ర చౌదరితో పాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకట రమణ ప్రాథమిక విచారణ జరిపి, BNS యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ కేసులో సిహెచ్. వసంత్ కుమార్, టి. ప్రద్యుమ్న కుమార్ రెడ్డి, సిహెచ్. జగ్గారావు, ఎం. జనార్ధన్ రెడ్డి, ఎ. సురేష్ రెడ్డిలను వరుసగా ఏ1 నుంచి ఏ5 వరకు నిందితులుగా చేర్చారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికల్లో నరేంద్ర చౌదరిని రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించుకునేందుకు, ఆయన ఆదేశాల మేరకు ఈ ఐదుగురు కలిసి పాత కమిటీకి సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : తండ్రి జ్ఞాపకార్థం రూ.100 కోట్లతో భారీ యూనివర్సిటీ: సుభాష్ చంద్ర కీలక నిర్ణయం!
JHIC మాజీ అధ్యక్షుడు కె. సురేందర్ రెడ్డి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత కమిటీ సభ్యుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి, రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్‌ను నమ్మించి తప్పుడు పత్రాలను సమర్పించారని ఫిర్యాదులో వివరించారు. ముఖ్యంగా, నరేంద్ర చౌదరిని రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఆమోదించినట్లుగా నిమిషాల పుస్తకంలో తప్పుడు పేరాను చేర్చి, దానిపై మాజీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. అంతేకాకుండా, “నో డిస్ప్యూట్ లెటర్” పేరుతో మరో నకిలీ పత్రాన్ని కూడా సృష్టించారు.
ఈ ఫోర్జరీ వల్ల నరేంద్ర చౌదరి నేరుగా లబ్ధి పొందారని, ఆయన చేసిన పనుల వల్ల జరిగిన ఎన్నికలు చెల్లవని, ప్రస్తుతం ఉన్న కమిటీకి చట్టబద్ధత లేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన నరేంద్ర చౌదరి, అప్పటి అధ్యక్షుడిని బెదిరించి క్లబ్ సాఫ్ట్‌వేర్ యాక్సెస్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అర్హత లేని సభ్యులను ఓటర్ల జాబితాలో చేర్చడం, సస్పెండ్ అయిన వారిని గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా మార్చడం వంటి పనులు చేశారని, అర్హులైన అభ్యర్థులను పోటీ చేయకుండా అడ్డుకున్నారని, ఎన్నికలు జరగకముందే ఏకగ్రీవమని ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవే కాకుండా, జూబ్లీహిల్స్ క్లబ్‌కు చెందిన రూ. 75 లక్షల నిధులను సొంత ప్రయోజనాల కోసం, కోర్టు కేసుల కోసం దుర్వినియోగం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : పురుషులను గౌరవించడం సంప్రదాయం… RTC బస్సులో బోర్డు వైరల్









