Ladakh :  లద్దాఖ్‌లో రైతులకు నీటి కష్టం తగ్గించేందుకు భారత్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. లేహ్‌లోని ఉప్షి దగ్గర ఇండస్ నదిపై తొలిసారిగా రాళ్లతో చిన్న డ్యామ్‌ను నిర్మించింది. ఈ డ్యామ్‌ను సహజంగా దొరికే పెద్ద రాళ్లతోనే కట్టారు. సిమెంట్‌ను ఉపయోగించలేదు. డ్యామ్ వల్ల నదిలో నీరు దాదాపు 10 అడుగుల ఎత్తుకు చేరింది. దీంతో నీరు లేక ఇబ్బంది పడుతున్న రైతులు తమ పొలాలకు నీటిని తీసుకెళ్లే అవకాశం వచ్చింది.

ఇప్పటివరకు ఈ ప్రాంతంలో రైతులు పంటలు పండించేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. నది లోతుగా ఉండటంతో అక్కడి నుంచి నీటిని పైకి తీసుకురావడం కష్టంగా ఉండేది. ముఖ్యంగా వసంతకాలంలో పంటలు వేసే సమయంలో నీరు లేక చాలా పొలాలు ఎండిపోయేవి. కొత్తగా కట్టిన ఈ డ్యామ్‌లో దాదాపు 4 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ఈ నీటిని కాలువ ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లోని పొలాలకు అందించనున్నారు. దీంతో రైతులకు ఎంతో ఉపయోగం కలగనుంది.

Also Read : డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్.. ఎయిర్ ఇండియా పైలట్ జాబ్ అవుట్!

ఇది రైతులకు ఉపయోగపడటమే కాకుండా భారత్‌కు మరో విధంగానూ ముఖ్యమే. ఇండస్ జలాల ఒప్పందాన్ని భారత్‌ ప్రస్తుతం పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో ఇండస్ నది నీటిని సరిహద్దు ప్రాంతాల్లోనే ఉపయోగించుకునేందుకు భారత్‌ చర్యలు మొదలుపెట్టిందనే సంకేతం ఈ డ్యామ్ ద్వారా కనిపిస్తోంది. లద్దాఖ్‌లో ఇలాంటి మరిన్ని చిన్న డ్యామ్‌లు కట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే పనులు మొదలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

మొత్తం 36 డ్యామ్‌లు కట్టేందుకు కేంద్రానికి లద్దాఖ్‌ అధికారులు ప్రతిపాదన పంపారు. ఇందులో లేహ్ ప్రాంతంలో 7 డ్యామ్‌లు, కార్గిల్ ప్రాంతంలో 29 డ్యామ్‌లు నిర్మించాలని కోరారు. వీటి కోసం రూ.56 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కాగా ఇండస్ నది లద్దాఖ్‌ మీదుగా ప్రవహించి ఆ తర్వాత పాకిస్థాన్‌లోకి వెళ్తుంది. ఇండస్ జలాల ఒప్పందం ప్రకారం ఇండస్, జీలం, చీనాబ్ నదుల నీటిని ప్రధానంగా పాకిస్థాన్ ఉపయోగించుకునే హక్కు ఉంది. అదే సమయంలో భారత్‌కు కూడా కొన్ని పరిమిత అవసరాల కోసం ఈ నదుల నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

Also Read : రాత్రి మిగిలిన రైస్ ఉదయాన్నే వేడి చేసి తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. మీరు హాస్పిటల్ బెడ్ రెడీ చేసుకున్నట్లే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.