Air India :  ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఆగస్టు 4న ఓ ఘటన జరిగింది. విమానం ఒక్కసారిగా 300 అడుగుల మేర కిందికి పడిపోయింది. దీంతో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విమానానికి కెప్టెన్‌గా ఉన్న పైలట్‌ను ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉద్యోగం నుంచి తొలగించింది. అతడికి చేసిన డ్రగ్ టెస్ట్‌లో సైకో యాక్టివ్ పదార్థం ఉన్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. భద్రత విషయంలో ఎలాంటి తప్పులను సహించబోమని ఎయిర్ ఇండియా చెప్పింది. నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందులో భాగంగానే పైలట్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తీసేసినట్లు పేర్కొంది.

ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ ఎయిర్‌బస్ A320 విమానంలో 145 మంది ఉన్నారు. విమానం 36 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న సమయంలో దాదాపు ఒకేసారి మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో విమానంలోని ఆటోపైలట్ ఆఫ్ అయింది. కొద్దిసేపు విమానం అదుపు తప్పే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత విమానం ఎత్తు తగ్గింది. ఈ ఘటనలో 24 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ఈ ఘటన తర్వాత పైలట్‌, కో-పైలట్‌కు డ్రగ్ టెస్టులు చేశారు. పైలట్‌కు పాజిటివ్ వచ్చింది. కో-పైలట్‌కు నెగెటివ్ వచ్చింది. అయితే పైలట్ డ్రగ్స్ తీసుకోవడం వల్లే విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయలేదని లేదా విమానం కిందికి పడిపోయిందని AAIB నివేదిక చెప్పలేదు. ఈ విషయంపై పూర్తి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. డ్రగ్ టెస్ట్‌లో పైలట్‌కు పాజిటివ్ రావడం చాలా సీరియస్ విషయమని AAIB తెలిపింది. పైలట్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏకు సూచించింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.