
సాధారణంగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని(Rice) మర్నాడు ఉదయం లేదా మధ్యాహ్నం వేడి చేసి తినడం చాలా ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం. ఆహారాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాం. అయితే మిగిలిపోయిన అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకుండా మళ్లీ వేడి చేసి తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వండిన అన్నంలో బాసిల్లస్ సిరియస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా విడుదల చేసే బీజాంశాలు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద అంటే అన్నాన్ని వండిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచినప్పుడు చాలా వేగంగా విస్తరిస్తాయి. ఈ బీజాంశాలు సాధారణంగా అన్నాన్ని మళ్లీ వేడి చేసినప్పటికీ నశించవు.
Also Read : దక్షిణాఫ్రికా మొత్తాన్ని ఫొటో తీసే కెపాసిటీ.. శత్రువుల దాడులను పసిగట్టే శక్తి.. GSLV-F17 ప్రత్యేకతలివే!
ఈ బ్యాక్టీరియా సోకిన అన్నాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.
అన్నం వండిన తర్వాత దానిని రెండు గంటల కంటే ఎక్కువ సేపు బయట ఉంచకూడదు. మిగిలిన అన్నాన్ని వెంటనే గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌లో ఉంచిన అన్నాన్ని కూడా ఒక రోజు కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకపోవడమే మంచిది.
ఫ్రిజ్‌లో నుంచి తీసిన అన్నాన్ని ఒక్కసారి మాత్రమే బాగా వేడిగా వేడి చేయాలి. ఒకసారి వేడి చేసిన అన్నాన్ని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టడం లేదా మళ్లీ మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్నే వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read : నేడే కృష్ణాష్టమి.. ఇలా పూజ చేసి నైవేద్యం పెడితే.. అష్టైశ్వర్యాలు అన్ని మీ ఇంట్లోనే!









