
Siddipet : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్‌పై తీవ్ర పదజాలంతో మాట్లాడారు. ఆయన చావు కోరుకుంటున్నామంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : నేను అలా లేదన్న తాతామధు.. తీర్మానం చేస్తామన్న స్పీకర్
మరోవైపు అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు బయలుదేరారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో వారు హుటాహుటిన బయలుదేరారు. ఎంతమంది పోలీసులను పంపుతారో పంపండి.. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో రండి.. తేల్చుకుందాం అంటూ బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని, పోలీసులను అడ్డం పెట్టుకుని ఆయనపై దాడులు చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని అన్నారు.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. అసెంబ్లీ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని, పోలీసులు ఆ విషయంలో జోక్యం చేసుకోరాదని కోర్టు తేల్చిచెప్పింది.
అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా కోర్టు తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలను కోర్టు సీరియస్‌గా తీసుకుంది. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులైన పోలీసులను గుర్తించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుని, ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
Also Read : ఎమ్మెల్సీ తాతామధు అనుచిత వ్యాఖ్యలు.. స్పీకర్ కంటతడి..









