Tata Madhu vs Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన ఘర్షణలో ఎమ్మెల్సీ తాతామధు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న ఆరోపణలపై తాతామధు స్పందించారు. స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అంటే తనకు గౌరవముందన్నారు. అయితే తను అనని మాటలను తనకు ఆపాదించడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘స్పీకర్‌ను నేనేమీ అనలేదు. ఆయనను అన్నట్లు భావిస్తే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. నా మాటలపై విచారం వ్యక్తం చేస్తున్నా. నాపై దాడి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. నాపై దాడి చేసిన వారిని మాత్రమే ఆవేశంతో అన్నాను’’ అని తాతా మధు తన వివరణ ఇచ్చారు.
tata-madhu

అయితే, అసెంబ్లీలోకి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై, ముఖ్యంగా మహిళలపై దాడి జరిగిందని తాతామధు ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తాతా మధు డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లే క్రమంలో తనపై కూడా దాడి జరిగిందని, తన షర్టు, ఫ్యాంటు లాగేందుకు, గొంతు నొక్కేందుకు ప్రయత్నించినట్లు ఆయన ఆరోపించారు. కొంతమంది తనను దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదనకు గురై.. తనపై దాడి చేసింది ఎవరు? తన షర్టు లాగేందుకు ఎవరు ప్రయత్నించారు? అలా చేయమని ఎవరు ఆదేశించారు? అంటూ తాను ప్రశ్నించినట్లు తాతా మధు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవిగా భావించడం సరికాదని ఆయన తేల్చి చెప్పారు.

స్పీకర్ వ్యవస్థ పట్ల, వ్యక్తిగతంగా స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తాతా మధు స్పష్టం చేశారు. స్పీకర్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఒకవేళ తన వ్యాఖ్యల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే.. ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.

అసెంబ్లీలో తీర్మానం చేస్తాం..స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌
కాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదే అంశపై స్పీకర్ ప్రసాద్ కుమార్‌మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ గేట్ వద్ద తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు సభలో మంత్రి సీతక్క కన్నీరు పెట్టుకోవడం తనను బాధించిందన్నారు. గత ఐదేళ్లుగా మంత్రి సీతక్క తనకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రాఖీ కడుతున్నారన్నారు. అలాంటి సోదరి లాంటి మంత్రి సభలో తనను అవమానించారంటూ కన్నీరు కారుస్తుంటే తన గుండె తరుక్కుపోయిందన్నారు. ఆ సమయంలో తన దు:ఖం అసలు ఆగలేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

కాగా, సభాపతి స్థానంలో ఉన్న తనను ఉద్దేశించి తాతామధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని స్పీకర్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై త్వరలోనే శాసనసభలో ప్రత్యేకంగా తీర్మానం చేస్తామన్నారు. ఆ తీర్మానాన్ని తదుపరి చర్యల నిమిత్తం శాసనమండలికి పంపుతామని, మండలి నిర్ణయంపై ఆధారపడి తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.