
Speaker Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించిన సమయంలో సహనం కోల్పోయిన ఆయన స్పీకర్ ను ఉద్దేశించి అసభ్య పధజాలం ఉపయోగించారని ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
సభాపతి అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషించిన తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సభాపతికి జరిగిన అవమానం సభ్య సమాజానికి జరిగిన అవమానంగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో వాడరాని భాష వాడిన తాతా మధును డిస్మిస్ చేయాలని కోరారు. ఇక బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తాతా మధు వాడిన భాషను బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. స్పీకర్‌పై అసభ్యకర భాషను వాడిన సభ్యుడిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సభ కొనసాగుతున్న సమయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది.
ఎమ్మెల్సీ తాతా మధు తెలంగాణ శాసనసభలో స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ తల్లిని బీఆర్ఎస్ సభ్యులు దూషించడం పట్ల ఆ తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుందోనని సీతక్క కంటతడి పెట్టుకున్నారు. అణగారిన వర్గాల బిడ్డలు అత్యున్నత పదవుల్లో కూర్చుంటే ఓర్వలేకపోతున్నారంటూ బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. అవమానకరంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలన్నారు, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.









