Mojtaba Khamenei :  ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ముజ్తబా ఖమేనీకి సంబంధం ఉన్నాయని చెబుతున్న లండన్‌లోని రెండు ఖరీదైన ఫ్లాట్లు ఇప్పుడు అమ్మకానికి వచ్చాయి. ఈ రెండు ఫ్లాట్ల విలువ కలిపి సుమారు 36 మిలియన్‌ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ.460 కోట్లు. అయితే ఈ ఫ్లాట్లకు ఖమేనీ నేరుగా యజమాని కాదని బ్రిటన్‌ ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇరాన్‌కు చెందిన వ్యాపారవేత్త అలీ అలీఅక్బర్‌ అంసారీ పేరు యజమానిగా రికార్డుల్లో ఉంది.

Also Read : భారత్‌కు బ్రిటన్‌ గుడ్‌న్యూస్‌.. కార్బన్‌ పన్నుపై ఊరట!

అంసారీ ఈ ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నారని తెలుస్తోంది. ఆ అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో.. అప్పు ఇచ్చిన వారు తమ డబ్బు తీసుకునేందుకు రిసీవర్లను నియమించారు. ఇప్పుడు ఆ రిసీవర్ల ఆధ్వర్యంలోనే ఫ్లాట్లను అమ్ముతున్నారు. అమ్మకానికి వచ్చిన వాటిలో ఒకటి భారీ పెంట్‌హౌస్‌. దీని ధరను సుమారు 12 మిలియన్‌ పౌండ్లుగా నిర్ణయించారు. అంటే దాదాపు రూ.153 కోట్లు. 3A ప్యాలెస్‌ గ్రీన్‌లో ఉన్న ఈ పెంట్‌హౌస్‌లో ఐదు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. సిబ్బంది కోసం ప్రత్యేక గది కూడా ఉంది. పైకప్పుపై ఉన్న పెద్ద టెర్రస్‌ నుంచి కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ కనిపిస్తుంది.

రికార్డుల ప్రకారం.. అంసారీ ఈ పెంట్‌హౌస్‌ను 2016లో సుమారు 19 మిలియన్‌ పౌండ్లకు కొనుగోలు చేశారు. మరో ఫ్లాట్‌ను 2014లో 16.75 మిలియన్‌ పౌండ్లకు కొన్నారు. ఈ రెండు ప్రాపర్టీలు ప్రిన్స్‌, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ అధికారిక నివాసానికి దగ్గర్లోనే ఉన్నాయి. ఇక అంసారీపై బ్రిటన్‌, అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC)కు ఆర్థిక సహాయం చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 2025 అక్టోబర్‌లో బ్రిటన్‌ ప్రభుత్వం ఆయన ఆస్తులను ఫ్రీజ్‌ చేయడంతో పాటు పలు ఆంక్షలు విధించింది.

అంసారీకి లండన్‌లో 140 మిలియన్‌ పౌండ్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పుడు అమ్ముతున్న ఈ రెండు ఫ్లాట్ల ద్వారా వచ్చే డబ్బును కూడా ఆంక్షల కారణంగా ప్రభుత్వం ఫ్రీజ్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఫ్లాట్లు చివరకు ఎంత ధరకు అమ్ముడవుతాయి? అమ్మకం తర్వాత వచ్చే డబ్బు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే విషయాలపై ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. మొత్తానికి.. ఖమేనీతో సంబంధం ఉన్నాయని చెబుతున్న లండన్‌లోని కోట్ల విలువైన ఫ్లాట్లు ఇప్పుడు అమ్మకానికి రావడం ఆసక్తికరంగా మారింది.

Also Read : సైన్యంలో చేరాలని ఒత్తిడి… రష్యా పోలీసుల అదుపులో యూపీ ఇంజినీర్‌..!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.