Hyderabad :  హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన జరిగిన ఆరు నెలలకే ఓ ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన కాక కీర్తి (28) కుషాయిగూడలోని వైష్ణవి ఎంక్లేవ్‌లో ఉంటూ క్యూర్‌ ఆర్థో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తోంది. ఏడాది నుంచి అక్కడే నివాసం ఉంటున్న కీర్తికి ఆరు నెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాఘవతో వివాహం జరిగింది.

Also Read : దారుణం.. భార్యను చంపి తలను ఫ్రిజ్‌లో దాచిన భర్త!

భర్త రాఘవ పని నిమిత్తం తిరుపతి వెళ్లిన సమయంలో కీర్తి ఇంట్లోని వంటగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్‌ ఇంటి పైపోర్షన్‌లో కీర్తి అద్దెకు ఉంటోంది. సోమవారం కీర్తి విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమె ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటి యజమానులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా కీర్తి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే కీర్తి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన ఆరు నెలలకే ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వారం రోజుల క్రితం తిరుపతికి వెళ్లిన భర్త రాఘవ ఇప్పటివరకు ఎందుకు తిరిగి రాలేదన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేక పని నిమిత్తమే రాఘవ తిరుపతి వెళ్లాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

కీర్తి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తిరుపతి నుంచి బయలుదేరారు. వారు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Also Read : డ్యాన్స్ క్లాస్‌కు వెళ్తానన్న భార్య.. వంట చేయలేదని భర్త దారుణం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.