Guwahati :  అసోంలోని గువాహటిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కొద్ది నెలలకే 25 ఏళ్ల యువతి తన అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైంది. భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సెప్టెంబర్ 6న అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు, రెండు రోజులుగా ఆ దంపతులు కనిపించడం లేదని, వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయని పోలీసులకు చెప్పారు.

దీంతో పోలీసులు అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకుని తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ యువతి మృతదేహం కనిపించింది. అప్పటికే మృతదేహం కుళ్లిపోవడం మొదలైంది. ఆమె వేళ్లను కూడా సగం వరకు నరికినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహానికి తల కనిపించలేదు. మృతురాలిని రియా తాలూక్దార్‌ గా పోలీసులు గుర్తించారు. ఇంట్లో మరింతగా తనిఖీ చేయగా.. ఆమె తలను ఓ పాలిథిన్‌ సంచిలో పెట్టి ఫ్రిజ్‌లో దాచినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే అప్పటికే ఆమె భర్త ఇంట్లో లేడు. శుక్రవారం చివరిసారిగా అతడిని చూసినట్లు ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. దీంతో భర్త కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహంతో పాటు తలను కూడా పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి మృతురాలి భర్త స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రస్తుతం నిందితుడిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అతడు చెప్పే వివరాలను ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో పోలీసులు సరిపోల్చనున్నారు. అయితే ఈ హత్యకు అసలు కారణం ఏమిటన్నది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. నిందితుడు ఎందుకు లొంగిపోయాడనే దానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటనకు సంబంధించి జరిగిన పరిణామాలను పోలీసులు ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. ఈ హత్యలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.