Nagpur :  డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లాలనుకున్న ఓ భార్య నిర్ణయం చివరకు విషాదంగా మారింది. ఇంట్లో భర్త, పిల్లల కోసం వంట చేయకుండా డ్యాన్స్ క్లాస్‌కు వెళ్తానని చెప్పడంతో మొదలైన గొడవ.. చివరకు ఆమె ప్రాణాలు తీసింది. మద్యం మత్తులో ఉన్న భర్త భార్యపై దారుణంగా దాడి చేయడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.

మృతురాలిని 38 ఏళ్ల యామిని కృష్ణ లాల్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త 41 ఏళ్ల కృష్ణ లాల్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ లాల్ పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో తనకు, పిల్లలకు వంట చేయాలని భార్య యామినిని అడిగాడు. అయితే అప్పటికే యామిని తమ హౌసింగ్ సొసైటీలో జరిగే డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. తాను వంట చేయలేనని, డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లాలని ఆమె భర్తకు చెప్పింది.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం : కారు నుజ్జు నుజ్జు.. 8 మంది స్పాట్!

దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గొడవ తీవ్రంగా మారింది. ఆ సమయంలో కృష్ణ లాల్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆవేశంలో భార్యపై దాడి చేశాడు. ఆమె మెడ, పొట్టపై తీవ్రంగా కొట్టాడు. ఈ దాడి ఇద్దరు చిన్న పిల్లల ముందే జరిగినట్లు పోలీసులు చెప్పారు.
దాడి తర్వాత యామినికి మెడ, కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. తనకు నొప్పి ఎక్కువగా ఉందని, పెయిన్‌కిల్లర్స్ తీసుకురావాలని భర్తను కోరింది. దీంతో కృష్ణ లాల్ మెడిసిన్ కోసం మెడికల్ షాప్‌కు వెళ్లాడు. అయితే ఆ షాప్ మూసి ఉండటంతో మందులు తీసుకురాకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.

అప్పటికే యామిని పరిస్థితి మరింత విషమించింది. ఆమె పొట్ట వాచిపోవడం మొదలైంది. లోపల తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చివరకు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యామిని ప్రాణాలు కోల్పోయింది. మొదట యామిని మృతిని పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. యామిని మెడలోని ఎముక విరిగిపోయినట్లు, పేగులకు తీవ్రంగా గాయాలైనట్లు రిపోర్టులో తేలింది.

అంతేకాదు.. ఆమెను గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. దీంతో ఇది ప్రమాదం కాదని, దాడి వల్లే యామిని చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. యామిని సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. తమకు మొదట ఆమె మరణవార్త ఫోన్ ద్వారా తెలిసిందని చెప్పాడు. తాము ముంబైలో ఉన్న సమయంలో యామిని చనిపోయిందని ఫోన్ వచ్చిందని తెలిపాడు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ చూసిన తర్వాత అసలు విషయం బయటపడిందన్నాడు.

తన సోదరి గొంతు నులిమినట్లు, ఆమె పొట్టపై కూడా తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని యామిని సోదరుడు చెప్పాడు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తన బావ కృష్ణ లాల్ యాదవ్‌ను అరెస్ట్ చేశారని తెలిపాడు. హత్య కేసు కింద అతడిపై కేసు పెట్టారని చెప్పాడు. ఇద్దరి మధ్య గతంలో కూడా గొడవలు జరిగేవని యామిని సోదరుడు చెప్పాడు. భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే అనుకుని తాము పెద్దగా పట్టించుకోలేదని తెలిపాడు. తన సోదరి అప్పుడప్పుడు తనతో భర్తతో గొడవల గురించి చెప్పేదని అన్నాడు.

అప్పుడు తాను గొడవల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, అవసరమైతే తాము జోక్యం చేసుకుంటామని చెప్పేవాడినని యామిని సోదరుడు తెలిపాడు. కానీ తన సోదరి మాత్రం ‘ఇది మా కుటుంబ విషయం.. మీరు జోక్యం చేసుకుంటే తర్వాత నాకు మరిన్ని సమస్యలు వస్తాయి’ అని చెప్పేదని వివరించాడు. ఆమె అలా చెప్పడంతో తాము కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పాడు. సాధారణ భార్యాభర్తల గొడవలుగానే భావించామని.. కానీ చివరకు తన సోదరి ప్రాణాలు కోల్పోతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో తీవ్రమైన గాయాలు బయటపడటంతో పోలీసులు కృష్ణ లాల్‌ను ప్రశ్నించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read : డేటింగ్ యాప్‌లో అమ్మాయి పరిచయం.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్ట్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.