
రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక మొబైల్ అప్లికేషన్‌పై సైబర్ దాడి జరిగింది. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్ దాడులు, ఇతర అత్యవసర ప్రమాదాల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఉపయోగించే ఈ యాప్‌లోకి హెకర్లు చొరబడ్డారు. హ్యాకింగ్ అనంతరం సైబర్ నేరగాళ్లు రష్యా పౌరుల మొబైల్ ఫోన్లకు తప్పుడు అణు దాడి హెచ్చరికలు పంపడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అయోమయం నెలకొన్నాయి.
Also Read : భూమివైపు దూసుకొస్తున్న నాసా స్విఫ్ట్ టెలిస్కోప్.. ఎక్కడ పడబోతుందంటే?
అదే సమయంలో ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్, యాంటీ డిస్ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా తమ అలర్ట్ సిస్టమ్స్‌పై సైబర్ దాడి జరిగినట్లు వెల్లడించాయి. ఈ సైబర్ చొరబాటు వల్ల ఉక్రెయిన్‌లో కూడా తప్పుడు రేడియేషన్ భయం వ్యాపించింది. ఖేర్సన్ ప్రాంతంలో ఉక్రెయిన్-రష్యా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే రెండు దేశాల్లోని అత్యవసర హెచ్చరికల వ్యవస్థలు సైబర్ దాడులకు గురికావడం గమనార్హం. తమ యాప్‌పై భారీగా సైబర్ దాడి జరిగిందని వచ్చిన అణు హెచ్చరికలన్నీ తప్పుడు సమాచారమని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు స్పష్టం చేసింది.
చరిత్రలో సాంకేతిక లోపాలు లేదా తప్పుడు అలర్ట్‌ల వల్ల అణు యుద్ధ మేఘాలు అలముకున్న సందర్భాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 1983లో అమెరికా-సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ అమెరికా క్షిపణులు ప్రయోగించినట్లు తప్పుడు సంకేతాలు ఇచ్చింది. అయితే కమాండ్ సెంటర్ డ్యూటీ ఆఫీసర్ స్టానిస్లావ్ పెట్రోవ్ చాకచక్యంగా వ్యవహరించి.. అది కంప్యూటర్ వ్యవస్థలోని సాంకేతిక లోపమని గుర్తించడంతో అప్పట్లో తీవ్రమైన అణు యుద్ధం త్రుటిలో తప్పిపోయింది. అలాగే అంతకుముందు అమెరికా కమాండ్ సెంటర్ కంప్యూటర్లలోనూ ఇలాంటి పొరపాటు జరిగి రష్యా అణుదాడికి దిగుతోందని తప్పుడు హెచ్చరికలు రావడం.. దాంతో అమెరికా యుద్ధ విమానాలను సిద్ధం చేయడం జరిగింది.
ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్‌లపై జరిగిన ఈ సైబర్ దాడి అంతర్జాతీయంగా భయాందోళనలు రేకెత్తించింది. డిజిటల్ వ్యవస్థలపై శత్రు మూకలు జరిపే ఇటువంటి సైబర్ ప్రయోగాలు తప్పుడు సంకేతాలను పంపి ఏ క్షణంలోనైనా ప్రపంచ శాంతికి ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : సైరన్ మోగింది.. అణు బాంబు వస్తోంది.. రష్యాను ఊపేసిన బిగ్గెస్ట్ సైబర్ ట్విస్ట్!









