
కొన్ని వారాల తాత్కాలిక విరామం తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సత్ఫలితాలనిస్తున్నాయన్న వార్తల నడుమే, ఇరాన్‌లోని ఖేష్మ్ ఐలాండ్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ద్వీపంలోని దాదాపు ఐదు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఖేష్మ్తో పాటు కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలోని బందర్ లెంగే నగరంలో కూడా వరుస పేలుళ్లు సంభవించాయి. దాడుల సమయంలో ఆకాశంలో రెండు యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడాన్ని స్థానికులు గమనించినట్లు సమాచారం.
కీలకమైన హర్మూజ్ జలసంధి పరిసరాల్లో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 సహా మరో రెండు డ్రోన్లను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కూల్చివేసింది. దీనికితోడు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా.. తమ ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌పై ఈ ప్రతిదాడులు చేపట్టినట్లు స్పష్టం చేసింది.
మరోవైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ ఈ పరిణామాలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల అనంతరం ఇరాన్‌పై పూర్తిస్థాయి దాడులు జరగొచ్చని, ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మిలిటరీ అధికారులు యాక్షన్ ప్లాన్‌పై బ్రీఫింగ్ ఇచ్చినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఇటీవల ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయన్న సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా శాంతించాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు దాదాపు 10 డాలర్ల మేర పడిపోవడంతో.. “ఇరాన్‌తో యుద్ధం ఉండకపోవచ్చని, త్వరలోనే శాంతి పరిష్కారం లభిస్తుందని” ట్రంప్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ఇంతలోనే ఖేష్మ్ ఐలాండ్‌పై ఆకస్మిక దాడులు జరగడంతో గ్లోబల్ మార్కెట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ధరలు మళ్లీ పెరగడం మొదలైంది.









