అంతరిక్షంలోని అంతుచిక్కని రహస్యాలను ఛేదించడానికి మానవుడు పంపిన ఎన్నో యంత్రాలు కాలక్రమేణా కనుమరుగవుతుంటాయి. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన అంతరిక్ష పరిశోధనా యంత్రం ఇప్పుడు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని.. నేరుగా భూమి వైపు భీకర వేగంతో దూసుకొస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ప్రముఖ ‘స్విఫ్ట్ స్పేస్ టెలిస్కోప్’ త్వరలోనే భూ వాతావరణంలోకి ప్రవేశించి భీకరమైన అగ్నిగోళంలా మారుతూ కుప్పకూలే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా విశ్వంలోని అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాలను కనిపెడుతూ వచ్చిన ఈ టెలిస్కోప్.. ఇప్పుడు తన అంతిమ అంకానికి చేరుకుంటోంది.

Also Read : అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్స్ ఓడిపోతే.. వీటో వాడుతాన్న ట్రంప్

అసలు ఈ టెలిస్కోప్ ఎందుకు పడిపోతోంది?

2004 సంవత్సరంలో అంతరిక్షంలోకి ప్రయోగించిన నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ ఆబ్జర్వేటరీ ప్రధానంగా విశ్వంలో సంభవించే గామా-రే విస్ఫోటనాలను అధ్యయనం చేయడానికి రూపకల్పన చేశారు. విశ్వం పుట్టుక, బ్లాక్ హోల్స్ ఆవిర్భావం వంటి ఎన్నో రహస్యాలను ఛేదించడంలో ఈ టెలిస్కోప్ కీలక పాత్ర పోషించింది. అయితే కాలక్రమేణా వాతావరణం నుంచి ఎదురైన ఘర్షణ కారణంగా దీని కక్ష్య క్రమంగా తగ్గిపోయింది. దీనిని రక్షించేందుకు నాసా ఇటీవల ఒక రెస్క్యూ మిషన్‌ను ప్లాన్ చేసినప్పటికీ అది విఫలమవడంతో టెలిస్కోప్ భవితవ్యం ముగింపు దశకు చేరింది. అక్టోబర్ నాటికి ఇది భూమికి అతి సమీపానికి పడిపోవడంతో నాసా దీని ఆపరేషన్స్‌ను పూర్తిగా నిలిపివేసి సురక్షిత మోడ్‌లోకి మార్చింది.

ప్రస్తుతం ఈ టెలిస్కోప్ భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనై వాతావరణంలోకి తీవ్ర వేగంతో ప్రవేశించి మంటల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ ప్రయాణంలో దీని అల్యూమినియం శరీరం, వైర్లు పూర్తిగా కాలిపోయినప్పటికీ.. టంగ్‌స్టన్, టైటానియం, స్టీల్, గ్లాస్‌తో తయారైన కొన్ని కీలక భాగాలు మాత్రం పూర్తిగా దెబ్బతినకుండా భూమిపై పడే అవకాశం ఉందని ఏరోస్పేస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ శకలాలు ఎక్కడ కూలుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. భూమధ్యరేఖకు చుట్టూ ఉన్న పరిధిలో ఇవి పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలలో ఎక్కువ భాగం సముద్రమే అయినప్పటికీ ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలోని కొన్ని జనవాస ప్రాంతాలు కూడా ఈ ప్రమాదపు అంచున ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ టెలిస్కోప్‌ను కేవలం రెండేళ్ల మిషన్ కోసం మాత్రమే నాసా ప్లాన్ చేసింది. కానీ ఇది అంచనాలకు మించి ఏకంగా 11 రెట్లు ఎక్కువ కాలం.. అనగా సుమారు 22 ఏళ్ల పాటు పని చేసి అరుదైన రికార్డు సృష్టించింది. గడచిన ఈ దీర్ఘకాలిక సర్వీస్‌లో ఈ టెలిస్కోప్ దాదాపు 2,000 పైగా గామా-రే విస్ఫోటనాలను, 1,400 సూపర్‌నోవా పేలుళ్లను గుర్తించి ప్రపంచానికి అద్భుతమైన శాస్త్రీయ సమాచారాన్ని అందించింది. నాసా అందించిన సమాచారం ప్రకారం దీని ఆర్కైవ్‌లో మిలియన్ల కొద్దీ చిత్రాలు, స్పెక్ట్రా నిల్వ ఉన్నాయి.

ఇన్ని అద్భుత ప్రయోజనాలు చేకూర్చిన ఈ అంతరిక్ష యంత్రం ఇప్పుడు ఇలా భూమిపైకి కూలుతుండటం సైన్స్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఏ క్షణంలోనైనా ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించి అగ్నిగోళంలా మారే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు దీని గమనాన్ని ఆసక్తిగా, ఆందోళనతో గమనిస్తున్నాయి.

Also Read : నిరసనల పేరుతో Gen Z టూటీలు.. 34 నగరాల్లో రోడ్ల మీదకు యూత్!