
అమెరికా మిడ్‌టర్మ్ ఎలక్షన్స్ సమీపిస్తున్న కొద్దీ వాషింగ్టన్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే, తాను ‘మిస్టర్ వీటో’ లా మారతానని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.
డెమొక్రాట్లు బిల్లులు పంపిస్తే వాటిని నేరుగా వీటో చేస్తానని, తన అడ్మినిస్ట్రేషన్ సాధించిన ఫలితాలను నాశనం చేయనివ్వబోనని ట్రంప్ స్పష్టం చేశారు. వరుస వీటోల తర్వాత చివరికి డెమొక్రాట్లే దిగొచ్చి రాజీకి వస్తారని, డీల్స్ కుదుర్చుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తన మొదటి టర్మ్‌లో 10 బిల్లులను, ప్రస్తుత టర్మ్‌లో ఇప్పటివరకు 2 బిల్లులను వీటో చేశారు.
“I guess I’ll become Mr. Veto.”
President Trump lays out his strategy for dealing with a potential Democratic-controlled Congress in an exclusive interview with Miranda Devine.
Trump says he would veto legislation before eventually negotiating compromises, while expressing hope Republicans maintain control after Tuesday’s midterms.
— Fox News (@FoxNews) November 1, 2026
Also Read : నిరసనల పేరుతో Gen Z టూటీలు.. 34 నగరాల్లో రోడ్ల మీదకు యూత్!
కాంగ్రెస్ రేసులో తీవ్ర పోటీ
నవంబర్ 3న జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని మొత్తం 435 స్థానాలతో పాటు, సెనెట్‌లోని సుమారు మూడో వంతు సీట్లకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం హౌస్‌లో రిపబ్లికన్లకు 218-214, సెనెట్‌లో 53-47 స్వల్ప మెజారిటీ ఉంది. మెజారిటీని తారుమారు చేయడానికి డెమొక్రాట్లకు ఉభయ సభల్లోనూ నాలుగు సీట్ల నికర ఆధిక్యం అవసరం.
ఇటీవలి సర్వేల ప్రకారం హౌస్‌లో డెమొక్రాట్లు పుంజుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతుండగా, సెనెట్‌లో పోటీ అత్యంత రసవత్తరంగా మారింది. సీబీఎస్ న్యూస్ పోల్ ప్రకారం డెమొక్రాట్లకు హౌస్‌లో 229 స్థానాలు వచ్చే అవకాశముందని ప్రొజెక్షన్స్ చెబుతున్నాయి.
వీటో అంటే..
లాటిన్ భాషలో ‘వీటో’ అంటే “నేను తిరస్కరిస్తున్నాను” అని అర్థం. అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్‌లోని రెండు సభలు ఏదైనా బిల్లును ఆమోదించిన తర్వాత, అది చట్టంగా మారడానికి అధ్యక్షుడి సంతకం తప్పనిసరి. ఆ బిల్లు అధ్యక్షుడి ముందుకు వచ్చినప్పుడు, ఆయనకు క్రింది అధికారాలు ఉంటాయి:
బిల్లును ఆమోదించడం: సంతకం పెడితే అది చట్టం అవుతుంది.
రెగ్యులర్ వీటో : బిల్లు తమ విధానాలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తే, అధ్యక్షుడు దానిపై సంతకం చేయకుండా తిరస్కరించి, అభ్యంతరాలను జతచేస్తూ తిరిగి కాంగ్రెస్‌కు పంపుతారు.
పాకెట్ వీటో: కాంగ్రెస్ సమావేశాల ముగింపు సమయంలో (10 రోజుల వ్యవధిలో) అధ్యక్షుడు బిల్లుపై సంతకం చేయకుండా పక్కన పెడితే, అది దానంతట అదే రద్దవుతుంది.
వీటో పవర్ అనేది ఎన్నికల ప్రక్రియలో ఓటింగ్ కోసం వాడేది కాదు; మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాల వల్ల ఏర్పడే రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అధ్యక్షుడు ఉపయోగించే ఒక రాజకీయ రక్షణ కవచం.
అమెరికాలో అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీకాలం సగం పూర్తయ్యాక (రెండేళ్లకు) మిడ్ టర్మ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ సమయంలో వీటో పవర్ పాత్ర క్రింది విధంగా ఉంటుంది. మిడ్ టర్మ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీ ప్రతినిధుల సభలో గానీ, సెనేట్‌లో గానీ మెజారిటీని కోల్పోవడం సాధారణంగా జరుగుతుంటుంది. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌లో మెజారిటీ సాధిస్తే, వారు అధ్యక్షుడి విధానాలకు విరుద్ధమైన బిల్లులను (ఉదాహరణకు: పన్ను పెంపు, ఆరోగ్య భద్రత మార్పులు, బడ్జెట్ కోతలు) ఆమోదించే ప్రయత్నం చేస్తారు. అటువంటి సమయంలో అధ్యక్షుడు తన వీటో అధికారాన్ని ప్రయోగించి ప్రత్యర్థి పార్టీ బిల్లులు చట్టం కాకుండా అడ్డుకుంటారు.
మిడ్ టర్మ్‌లో కాంగ్రెస్‌ను ప్రత్యర్థి పార్టీ గెలుచుకున్నప్పుడు, అధ్యక్షుడు తరచూ “మీరు తీసుకొచ్చే బిల్లులను నేను వీటో చేస్తాను” అని ముందే హెచ్చరిస్తారు. దీనివల్ల ప్రతిపక్షం మొండిగా వెళ్లకుండా, అధ్యక్షుడి షరతులకు ఒప్పుకుని పరస్పర రాజీతో కూడిన బిల్లులను తీసుకురావాల్సి వస్తుంది.
Also Read : అమెరికా ల్యాబ్‌లో బయటపడ్డ సీక్రెట్ మ్యాజిక్.. పాదరసం నుంచి బంగారం.. ఎలాగంటే?
ప్రచారం.. ఓటర్ల ఆందోళనలు
లివింగ్ కాస్ట్ పెరగడం, ఇరాన్ యుద్ధం వంటి అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్న వేళ, రిపబ్లికన్ పార్టీకి పట్టున్న రాష్ట్రాల్లోనూ ట్రంప్ విస్తృతంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అయితే సర్వేలను తోసిపుచ్చుతున్న ట్రంప్, దేశంలో ఎకానమీ బలంగా ఉందని చెబుతూ రిపబ్లికన్లు కాంగ్రెస్‌పై పట్టు నిలుపుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఫలితాలను గౌరవిస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఓటర్ ఫ్రాడ్ సమాచారం ఇచ్చిన వారికి మిలియన్ డాలర్ల రివార్డును సైతం ట్రంప్ గతంలో ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు.
మరోసారి ప్రెసిడెంట్ రేసులో నిలవడంపై మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనలు అత్యంత కచ్చితంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఎవరైనా రెండు సార్లకు మించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో, రాబోయే మిడ్‌టర్మ్ ఫలితాలు వాషింగ్టన్ అధికార సమతుల్యతను, వైట్ హౌస్ విధాన నిర్ణయాలను ఏ విధంగా మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.









