Sexual Harassment Case : రాజకీయ ఆందోళనల్లో పాల్గొన్న నాయకులపై తమ విధులకు ఆటంకం కలిగించారని లేదా తమపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేయడం సర్వాసాధారణం. కానీ తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా మాజీమంత్రులు, ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇటీవల ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సహా నలుగురు బీఆర్ఎస్ నేతలపై ఈ లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అసెంబ్లీ ప్రాంగణంలో చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఇటీవల తెలంగాణ శాసనసభ గేటు ముందు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న తన పట్ల సదరు నేతలు అభ్యంతరకరంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని ఓ మహిళా కానిస్టేబుల్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్, హరీశ్ రావు తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడం రాజకీయంగా చర్చనీయంశంగా మారింది.

Also Read : బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం.. సీఎం రేవంత్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్

కేసులు ఏంటంటే?

హైదరాబాద్‌ సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(సీఏఆర్‌) హెడ్‌క్వార్టర్‌ మహిళా కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎస్‌ నేతలపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 74 (మహిళ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి చేయడం).. 75(1) (లైంగిక వేధింపులు).. 79 (మహిళ మర్యాదకు అవమానం కలిగించేలా సైగ చేయడం).. 121(1) (విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని గాయ పర్చడం).. 130 (ప్రభుత్వ ఉద్యోగి విధికి ఆటంకం కలిగేలా బలప్రయోగం చేయడం).. 132 (ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించేందుకు ప్రయత్నించేలా దాడి చేయడం).. 296 (బహిరంగ ప్రదేశంలో అసభ్యకర చర్యలు).. 351(2) (క్రిమినల్‌ బెదిరింపులు).. 352 (శాంతిభద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే ఉద్దేశంతో అవమానించడం).. రెడ్‌విత్‌3(5) (ఒకే ఉద్దేశంతో పలువురు కలిసి నేరం చేసినప్పుడు అందరినీ బాధ్యులుగా పరిగణించడం) తదితర సెక్షన్లను బీఆర్‌ఎస్‌ నేతలపై ప్రయోగించారు.

Also Read : గణేశ్‌ విగ్రహం పెడుతున్నారా? ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి.. ఇలా చేయండి…

అసలు ఫిర్యాదులో ఏముందంటే…

‘ఈ నెల 7న నేను, సహాచర మహిళా పోలీసులతో కలిసి తెలంగాణ శాసనసభ గేట్‌ నంబర్‌ 3 వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నాను. ఉదయం 9.30 గంటల సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్, సుధీర్‌రెడ్డి, వివేకానంద్, కమలాకర్, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి మరికొంతమంది నేతలు కలిసి అక్కడికి వచ్చారు. వారిలో కొందరు ‘హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం’ అని రాతలున్న నల్ల టీ-షర్టులు ధరించి ఉన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్లకార్డులు, రాజకీయ నినాదాలున్న టీషర్టులు ధరించి అసెంబ్లీలోకి ప్రవేశించడానికి వీలులేదని చెప్పి సహకరించాలని కోరాం. దానికి లేడీ కానిస్టేబుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా? అని హరీశ్‌రావు గట్టిగా అరిచారు. అదే సమయంలో కేటీఆర్‌ మమ్మల్ని అవమానించేలా.. ఆడోళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసేది ఎవడయ్యా? ఇక్కడి లోకల్‌ డీసీపీ ఎవరు? అని బిగ్గరగా కేకలు వేశారు. మహిళా సిబ్బంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా భయపెట్టి మా విధులు నిర్వహించకుండా అడ్డుకోవడానికే వారు ఈ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

వారు ఎంత బెదిరించినా మేం వెనక్కి తగ్గకపోవడంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు తన టీషర్టు విప్పి ఒక పోలీస్‌ అధికారి పైకి విసిరేసి, మాముందు అర్ధనగ్నంగా నిలబడ్డారు. ఆయన్ని చూసి నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, ఇతరులు కూడా టీషర్టులు విప్పేసి మహిళా సిబ్బందికి అతి దగ్గరగా వచ్చి అర్ధనగ్నంగా నిలబడ్డారు. నవీన్‌రెడ్డి తీవ్రమైన దూకుడుతో, ఆడ పోలీసులను పెట్టేది ఎక్కడరా..? అంటూ కేకలు వేశారు. మేం అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తాం అని కొందరు తీవ్రంగా బెదిరించారు. ఈ చర్యలన్నీ మహిళా పోలీసుల మానప్రాణాలకు, గౌరవానికి భంగం కలిగించడానికే చేశారు. వారి చర్యలు మాపై శారీరక వేధింపుల కిందకే వస్తాయి. వారి నేరపూరిత ప్రవర్తనతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందాల్సివచ్చింది..’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.