
Congress vs BRS : శాసనసభ సమావేశాల సందర్భంగా జరిగిన ఆందోళనలు నేపథ్యంలో రాష్ర్టంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండవ రోజు బీఆర్ఎస్ ఆందోళనతో వారిని స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రదర్శించిన ఎక్స్ ఖాతాకు సంబంధించిన ప్రింట్ కాగితం సంచలనంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీస్ ఇవ్వడం సంచలనంగా మారింది.
ఈ మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు ఆయనకు ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. శాసనసభ వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఒక నకిలీ సోషల్ మీడియా పోస్టును ప్రస్తావించారని విపక్ష నేతలు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్సన్ తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, సంధ్యారావు పేరుతో ఉన్న సోషల్ మీడియా పోస్టును ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ‘అంతర్జాతీయ కార్యదర్శి’ అని ఉటంకిస్తూ కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి అంతర్జాతీయ కార్యదర్శి అనే పదవే లేదని, సంధ్యారావు అనే వ్యక్తికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఐటీ సెల్ సృష్టించిన నకిలీ ఖాతా ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని తీవ్రంగా దుయ్యబట్టారు. బాధ్యతాయుతమైన సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, నిజా నిజాలు తెలుసుకోకుండా నకిలీ పోస్టుతో అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. అత్యున్నతమైన శాసనసభ గౌరవాన్ని తగ్గించేలా నకిలీ ఖాతాల ప్రచారాన్ని సీఎం వేదికగా చేసుకున్నందున రేవంత్ రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరడం గమనార్హం.
Also Read : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావులపై లైంగిక వేధింపుల కేసు
అది కాంగ్రెస్ పార్టీ ఫేక్ అకౌంట్
ఇదే విషయమై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఫేక్ అకౌంట్లను అసెంబ్లీకి తీసుకొచ్చి చదవడం సిగ్గుచేటని తీవ్రంగా దుయ్యబట్టారు. అంతర్జాతీయ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి చెబుతున్న సంధ్యారావు పేరిట అసలు బీఆర్ఎస్లో ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. అసలు అలాంటి పదవే బీఆర్ఎస్లో లేదని హరీష్‌రావు తేల్చి చెప్పారు. సంధ్యారావు పేరుతో కాంగ్రెస్ పార్టీయే ఫేక్ అకౌంట్ నడుపుతున్నదని ఆయన ఆరోపించారు. ఈ ఫేక్ అకౌంట్లపై తక్షణమే విచారణ చేపట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వ్యవహారంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే…
కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫాంహౌస్ వద్ద నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, దళితులు అక్కడ నిరసన తెలిపినందుకు బీఆర్ఎస్ నేతలు ఆ ప్రదేశాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేశారని రేవంత్ రెడ్డి శాసనసభలో ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే శుద్ధి చేసినట్లు అంతర్జాతీయ బీఆర్ఎస్ కార్యదర్శి సంధ్యారావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు రేవంత్ పేర్కొన్నారు. ఆయన ఆరోపణలకు ఆధారంగా సంధ్యారావు పేరుతో ఉన్న పోస్ట్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్ జిరాక్స్ కాపీని అసెంబ్లీలో చదివి వినిపించారు. ఈ విషయమై సభలో సీఎం మాట్లాడుతూ ‘కుట్రలో భాగంగా కేసీఆర్ ఉన్మాదిగా మారి ఆదేశాలు ఇచ్చారు. ఆ విషయాన్ని నేను చెప్పడం లేదు.. సంధ్యారావు బీఆర్ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి చెప్తున్నారు. ’కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దళితులు అడుగుపెట్టిన నివాసం చుట్టూ ఉన్న నేలంతా మైలపడటంతో పసుపు నీటితో శుద్ధి చేయడం జరిగింది’ అని అందులో చెప్పారు అని సీఎం సభలో చదివి వినిపించారు.
Also Read : తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం.. గవర్నర్ కు ఫిర్యాదు చేశాం.. కేటీఆర్
నిలిచిపోయిన ఖాతా…
కాగా, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చదివిన అనంతరం సంధ్యారాణి పేరుతో ఉన్న ఖాతా కోసం పలువురు నెటిజన్లు ఎక్స్‌లో వెతకడం ఆరంభించారు. అయితే సీఎం ప్రకటన అనంతరం ఆ ఖాతా నిలిచిపోవడం గమనార్హం. అయితే ఆఖాతాలో ఉన్న అంశాలను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు అది పక్కా కాంగ్రెస్ స్పాన్సర్ అకౌంట్‌గా తెలిసిపోతుందన్నారు. పేరుకు బీఆర్ఎస్ అని పెట్టి దాంట్లో అన్ని బీఆర్ఎస్కు వ్యతిరేకమైన పోస్టులు మాత్రమే చేశారని వారు ఆధారాలతో వెల్లడిస్తున్నారు.









