Vinayaka Chavithi 2026 : ఈ నెల 14 నుంచి దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటికే చాలామంది తమ తమ ప్రాంతాల్లో గణేష్‌ మండపాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే హైదరాబాద్‌లో గణేష్ మండపాల ఏర్పాటు చేయాలంటే ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి అంటున్నారు పోలీసులు. ఒకవేళ నమోదు చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నగర పోలీస్ యంత్రాంగం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరంలోని ఏ ప్రాంతంలోనైన గణేశ్ మండపాలను ఏర్పాటు చేయాలనుకునే వారు ముందస్తుగా తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సీపీ స్పష్టం చేశారు. నగరంలో నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి, భద్రతను పర్యవేక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read : స్పీకర్ సంచలనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ఎలా చేయాలంటే ?

గతంలో ఏదైనా ఒక ప్రాంతంలో వినాయక మండపం ఏర్పాటు చేయాలంటే ఉత్సవ నిర్వాహకులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సంబంధిత పత్రాలను సమర్పించి అనుమతులు తెచ్చుకోవలసి వచ్చేది. ఇపుడు ఆ అవసరం లేకుండా అనుమంతి ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత నిర్వాహకులు తెలంగాణ పోలీసు అధికారిక పోర్టల్ policeportal.tspolice.gov.in/index.htmను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత ఫారమ్‌లో మండపం నిర్మిస్తున్న ప్రదేశం, మండప కమిటీ సభ్యుల వివరాలు, వారి ఫోన్ నంబర్లు, ఏర్పాటు చేయదలుచుకున్న విగ్రహం ఎత్తు, ఉత్సవాలు జరిగే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, నిమజ్జనానికి వెళ్లే మార్గం వివరాలను అందులో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేసి సబ్‌మిట్‌ చేసిన తర్వాత సంబంధిత స్థానిక పోలీసు స్టేషన్ అధికారులకు సమాచారం వెళ్తుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఉత్సవ కమిటీలు వెంటనే మండపం వివరాల నమోదు పూర్తి చేసి భాగ్యనగర పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి కావాల్సిన పత్రాలు

వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయడంతో పాటు, ఉత్సవ కమిటీ స్థానిక యంత్రాంగం నుంచి కొన్ని నిరభ్యంతర(ఎన్‌వోసీ) పత్రాలు పొందాల్సి ఉంటుంది. అలాగే విద్యుత్ సరఫరా కోసం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ అనుమతి పొందడమే కాకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఇక మండపం ఏర్పాటు చేసే స్థలం ప్రభుత్వానిదైతే జీహెచ్‌ఎంసీ లేదా సంబంధిత శాఖ నుండి, వ్యక్తిగత స్థలమైతే యజమాని నుండి అనుమతి పత్రం పొంది ఉండాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా మండపంలో తగినన్ని ఇసుక బకెట్లు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవలసి ఉంటుంది.

Also Read : పోలీస్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. దరఖాస్తు గడువు పెంచిన బోర్డు

ఈ ముందస్తు నమోదు దేనికోసం?

గతంలో జరిగిన కొన్ని కారణాల వల్ల ముందస్తు నమోదు తప్పనిసరి చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో వినాయక మండపాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టు దిట్టం చేసేందుకు ఈ వివరాలు పోలీసులకు చాలా వరకు ఉపయోగపడతాయి. ఆయా ప్రాంతాల్లో సీసీటివి (CCTV) కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. మండపాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవడానికి ఈ వివరాలు అవసరమవుతాయి. ఆయా ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలపై నిఘా ఉంచేందుకు పోలీసు యంత్రాంగానికి ఈ ముందస్తు సమాచారం సహాయపడుతుంది. నగరంలోని నిమజ్జన ప్రదేశాల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేయడం సులువు అవడానికి దోహద పడుతాయి.

అలాగే రాత్రి వేళల్లో మైక్‌లు, బాక్సుల వాడకంపై నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పరిమితికి మించిన శబ్దాలతో మైక్‌లు పెడితే వారిపై చర్యలు ఉంటాయి. ప్రతి మండపం వద్ద రాత్రి వేళల్లో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు కమిటీ సభ్యులు కాపలాగా ఉండాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.