
Hyderabad Milk : హైదరాబాద్‌లో నేరుగా పశువుల నుంచి సేకరించి విక్రయించే పచ్చి పాల (అన్‌పాశ్చురైజ్డ్) వాడకంపై ఇటీవల వెలువడిన ఒక సమగ్ర అధ్యయనం కలకలం రేపుతోంది. ప్యాకెట్ పాలలో కల్తీ ఉందనే భయంతో చాలామంది ఎక్కువ ఖర్చయినా సరే, నేరుగా డెయిరీల నుంచి లేదా పాలు పితికి తెచ్చే వారి వద్ద పాలు కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ పచ్చి పాలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే మల సంబంధిత బ్యాక్టీరియా, ఈస్ట్, బూజు,సాల్మనెల్లా వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో కలిసి లండన్‌కు చెందిన రాయల్ వెటర్నరీ కాలేజ్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్,అంతర్జాతీయ పశుసంవర్ధక పరిశోధన సంస్థలు ఉమ్మడిగా ఈ పరిశోధనను నిర్వహించాయి. ఈ వివరాలు ‘ద రాయల్ సొసైటీ పబ్లిషింగ్ హౌస్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Also Read : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. 43.94 శాతం ఉత్తీర్ణత..
ఈ అధ్యయనంలో భాగంగా నగరంలోని అడ్డగుట్ట, వారాసిగూడ ప్రాంతాల నుంచి 42 పాల నమూనాలు, 20 నీటి నమూనాలు, 24 పశువుల మేత నమూనాలను సేకరించి విశ్లేషించారు. ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. పాలు లీక్ కావడం లేదా అపరిశుభ్ర నీటి వినియోగం వల్ల 90.5% పాల నమూనాల్లో మల సంబంధిత బ్యాక్టీరియా (Fecal Bacteria) ఉన్నట్లు తేలింది. అలాగే 95.2% శాంపిళ్లలో ఈస్ట్, బూజు, మూడో వంతు నమూనాల్లో తీవ్ర విరేచనాలకు కారణమయ్యే సాల్మనెల్లా, 31% శాంపిళ్లలో ఆహారాన్ని విషతుల్యం చేసే ‘స్టెఫలోకోకస్ ఔరీస్’,12% నమూనాల్లో అత్యంత ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ (E. coli) బ్యాక్టీరియా ఉన్నట్లు స్పష్టమైంది.
పశువులకు తినిపించే దాణా (మేత) లో కూడా నాణ్యతా లోపాలు తీవ్రంగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. సేకరించిన మేత నమూనాల్లో 67% శాంపిళ్లలో అఫ్లాటాక్సిన్లు (Aflatoxins) ఉన్నట్లు తేలింది. అఫ్లాటాక్సిన్ అనేది బూజు పట్టిన పశువుల దాణా, మొక్కజొన్న, వేరుశెనగ చెక్క వంటి వాటిలో పెరిగే అత్యంత ప్రమాదకరమైన సహజ సిద్ధమైన విష పదార్థం. పశువులు ఈ కలుషిత మేతను తిన్నప్పుడు, ఆ విష పదార్థాలు జీర్ణమై పాల ద్వారా బయటకు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం, ఇలాంటి అఫ్లాటాక్సిన్ ప్రభావిత పాలను గర్భిణులు తాగడం వల్ల కడుపులోని పిండంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల పుట్టే పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, వారిలో శారీరక, మానసిక ఎదుగుదల లోపాలు (Stunting) తలెత్తడం వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.
సాధారణంగా డైరీలలో లభించే ప్యాకెట్ పాలు ‘పాశ్చురైజ్డ్’ (Pasteurized) పద్ధతిలో శుద్ధి చేయబడతాయి. అంటే పాలను ప్యాక్ చేయడానికి ముందు 71.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 15 సెకన్ల పాటు వేడి చేసి, వెంటనే 4 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబరుస్తారు. దీనివల్ల అందులోని రోగకారక బ్యాక్టీరియా నశిస్తుంది. కాబట్టి ప్యాకెట్ పాలను ఒక పొంగు వచ్చేవరకు కాస్తే సరిపోతుంది. కానీ, పశువుల నుంచి నేరుగా తీసే పచ్చి పాలను (Raw Milk) ప్యాకెట్ పాలలాగా ఒక పొంగు రాగానే దించేస్తే అందులోని క్రిములు చనిపోవు. పచ్చి పాలను తక్కువ మంట మీద సమర్థవంతంగా మరిగించాలి. పాలు ఒకసారి పొంగు వచ్చిన తర్వాత కూడా కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు సన్నని సెగ (Simmer) మీద మరిగించినప్పుడు మాత్రమే అందులోని హానికర బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. ఈ అవగాహన లేకపోవడం వల్ల పిల్లల్లో తరచూ డయేరియా, పేగుల్లో ఇన్ఫెక్షన్లు, పోషకాహార లోపాలు వస్తున్నాయని ఎన్ఐఎన్ ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : BRS సంచలనం.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్!
ఈ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటానికి వినియోగదారులు, పశువుల పెంపకం దారులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.
వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలు:
సరైన పద్ధతిలో కాచడం: ప్యాకెట్ పాలు అయినా, నేరుగా డెయిరీ నుంచి తెచ్చిన పచ్చి పాలు అయినా పొంగు వచ్చిన తర్వాత కనీసం 5-10 నిమిషాల పాటు సన్నని సెగపై మరిగించాలి.
నమ్మకమైన వనరులు: వీలైనంత వరకు ప్రభుత్వ ధ్రువీకృత (FSSAI) డైరీల నుంచి లేదా పరిశుభ్రత ప్రమాణాలు పాటించే ఫామ్‌ల నుంచే పాలు కొనుగోలు చేయడం శ్రేయస్కరం.
పాలు నిల్వ చేయడం: కాచిన పాలను చల్లారిన వెంటనే శుభ్రమైన మూత ఉన్న పాత్రలో పోసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి.
పశువుల పెంపకందారులు / డెయిరీ యజమానులు పాటించాల్సిన జాగ్రత్తలు:
పరిశుభ్ర వాతావరణం: పశువుల షెడ్లను నిరంతరం శుభ్రంగా ఉంచాలి. పాలు పితికే ముందు పశువుల పొదుగులను స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడగాలి.
వ్యక్తిగత పరిశుభ్రత: పాలు పితికే వ్యక్తులు తమ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పాల వ్యాపారంలో క్లోరినేట్ చేసిన (రక్షిత) నీటిని మాత్రమే వినియోగించాలి.
నాణ్యమైన మేత: బూజు పట్టిన, తేమ ఎక్కువగా ఉన్న పశువుల దాణాను వాడకూడదు. మేతను పొడిగా ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయాలి.
క్రమబద్ధమైన పరీక్షలు: క్రమం తప్పకుండా పాల నమూనాలకు థర్మల్, బ్యాక్టీరియా పరీక్షలు చేయించడం ద్వారా వినియోగదారులలో నమ్మకాన్ని పెంచవచ్చు.









