
Prashant Kishor : బీహార్లో జరగబోయే బంకీపూర్ ఉప ఎన్నికల కోసం జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన కుటుంబానికి మొత్తం రూ. 198 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో రూ. 111.78 కోట్ల చొప్పున మొవబుల్ అసెట్స్, రూ. 86.29 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
Also Read : కోర్టులో క్షుద్రపూజలు.. జడ్జి కుర్చీపై మంత్రాలు : మహిళ అరెస్ట్ !
ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన ఈ ఆస్తుల్లో బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లు, బంగారు ఆభరణాలు, నివాస గృహాలు వంటివి ఉన్నాయి. విశేషమేమిటంటే, ఆయన ఆస్తుల జాబితాలో ఒక పాతబడిపోయిన రైస్ మిల్లు కూడా ఉంది. ఇవి కాకుండా, ఆయనపై కొన్ని క్రిమినల్ కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు.
రాజకీయాల్లోకి రాకముందు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన కాలంలో తాను రూ. 241 కోట్లు సంపాదించానని ప్రశాంత్ కిశోర్ గతంలోనే వెల్లడించారు. ఆ ఆదాయంపై ప్రభుత్వానికి జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించిన తర్వాత, మిగిలిన డబ్బులో కొంత భాగాన్ని జన సురాజ్ పార్టీ కోసం విరాళంగా ఇచ్చానని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. బీహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని, తప్పుడు ఆరోపణలకు తావులేకుండా ప్రతిదీ పారదర్శకంగానే ఉందని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు ఆయన తన మొదటి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు.
బంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో, ఆయన ప్రకటించిన ఈ ఆస్తుల వివరాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read : గుడ్న్యూస్: త్వరలోనే 10 కేజీల కమర్షియల్ సిలిండర్.. ధర ఎంతంటే?









