
10-kg LPG cylinders : టీ షాప్స్, చిన్న చిన్న హోటళ్లు, క్యాంటీన్లు నడిపేవారికి ముఖ్యంగా వలస కార్మికులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 19 కేజీల భారీ సిలిండర్లు కాకుండా, త్వరలో 10 కేజీల బరువున్న తేలికపాటి కంపోజిట్ కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ చమురు సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ కొత్త 10 కేజీల సిలిండర్ చిన్న వ్యాపారులకు, చిరుతిళ్ల స్టాల్స్ నిర్వహించేవారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 19 కేజీల సిలిండర్లను మోయడం కష్టంగా భావించేవారికి, అలాగే తక్కువ స్థలం ఉన్న చిన్న చిన్న హోటళ్లు, ఫుడ్ స్టాల్స్ నడిపేవారికి ఇది చక్కని ప్రత్యామ్నాయం. అలాగే, అద్దె ఇళ్లలో ఉండేవారు, విద్యార్థులు, వలస కార్మికులకు కూడా ఇది ఎంతో అనువుగా ఉంటుంది.
Also Read : బెంగళూరు బిడదిలో భూ సర్వేను అడ్డుకున్న మహిళారైతులు..చీపుర్లు పట్టుకుని..
ప్రస్తుతం 2, 5, 19 కేజీల సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 5 , 19 కేజీల మధ్య ఏదైనా ఒక మధ్యస్థ సిలిండర్ ఉండాలని చిన్న వ్యాపారులు చాలా కాలంగా కోరుతున్నారు. వారి కోరిక మేరకు ఈ 10 కేజీల సిలిండర్లను తీసుకురానున్నారు. దీని ధరను కమర్షియల్ రేట్ల ప్రకారమే నిర్ణయించనున్నారు. అయితే, ధర ఎంత ఉంటుందనేది ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, ఇండియాలో గ్యాస్ నిల్వలకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు 45 రోజుల పాటు సరిపడా ఎల్పీజీ నిల్వలు మన వద్ద ఉన్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇప్పటికే వెల్లడించారు.
Also Read : అమ్మాయితో అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్!









