Bengaluru : బెంగళూరులో ఇటీవల ఓ అమ్మాయిపై జరిగిన ఘటన పట్ల ఫ్లిప్‌కార్ట్ సంస్థ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కస్టమర్ల రక్షణే తమ ప్రాథమిక బాధ్యత అని, దీని విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఉదంతం తమ దృష్టికి వచ్చిన వెంటనే, బాధితురాలికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. నిందితుడైన డెలివరీ ఏజెంట్‌ను వెంటనే ఉద్యోగం నుండి తొలగించినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. అటు పోలీసుల విచారణకు కూడా తాము పూర్తిగా సహకరిస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుపోవడానికి అవసరమైన అన్ని వివరాలను అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

తమ ప్లాట్‌ఫారమ్‌లో పనిచేసే డెలివరీ భాగస్వాములందరికీ తప్పనిసరిగా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ , భద్రతా పరమైన శిక్షణ ఇచ్చాకే విధుల్లోకి తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదైనప్పటికీ, ఒక్కటి జరిగినా అది తీవ్రమైన విషయమేనని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. కస్టమర్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు, ప్రస్తుత విధానాలను క్షుణ్ణంగా సమీక్షిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరింత కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో హామీ ఇచ్చింది.

Also Read : అత్యాచారానికి వెల కట్టిన గ్రామ పెద్దలు.. నిందితుడి జరిమానాతో ఫుల్ దావత్!

ఇంతకు ఏం జరిగిందంటే..

ఓ మహిళకు పార్శిల్ ఇచ్చేందుకు విజయ్ మల్లికార్జున్ కామత్ అనే డెలివరీ ఏజెంట్ ఆమె ఇంటికి వెళ్ళాడు. పార్శిల్ అందించిన తర్వాత అతను వాష్‌రూమ్ వాడతానని అడిగాడు. అయితే, బయటి వ్యక్తులను ఇంటి లోపలికి అనుమతించనని ఆమె ఖచ్చితంగా చెప్పింది. ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండానే అతను బలవంతంగా ఆమె ఇంట్లోకి దూరిపోయాడు. వాష్‌రూమ్ వాడుకుని బయటకు వచ్చిన తర్వాత, అతను ఆ మహిళ పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు.

తన ఇంట్లోనే తనకు రక్షణ లేకుండా పోయిందని, అతని చేష్టలతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు పారిపోవడానికి వీలుగా, ఆమె తన ఇంటి తలుపులు తీసి ఉంచి, ఫోన్ కెమెరా ఆన్ చేసి మరీ జాగ్రత్త పడింది. ఈ ఘటనపై ఆమె మరాఠహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Also Read : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఫలితాలు విడుదల.. ఇలా చూసుకోండి!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.