
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ AI రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొత్త టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ అని పేరు పెట్టారు. ప్రపంచంలో AI అభివృద్ధిలో అమెరికా ముందంజలో ఉండేలా ఈ బృందం పనిచేయనుంది. ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కొత్త బృందానికి అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జే క్లేటన్ నాయకత్వం వహించనున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చైర్మన్ ఆండ్రూ ఫెర్గూసన్, పెంటగాన్‌లో రీసెర్చ్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎమిల్ మైఖేల్, ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ స్కాట్ కుపోర్ కూడా ఈ బృందంలో ఉంటారు. ఈ బృందం నేరుగా ట్రంప్‌తో పాటు వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రిపోర్ట్ చేయనుంది.
అమెరికా ప్రభుత్వం AI విషయంలో తీసుకునే చర్యలను ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ సమన్వయం చేయనుంది. AI వల్ల వచ్చే అవకాశాలు, సమస్యలు, భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ బృందం దృష్టి పెట్టనుంది. అలాగే సాధారణ ప్రజలు, ప్రజా ప్రయోజన సంస్థలు, మత సంస్థలు, దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల సంస్థలు, AI కంపెనీలతో ప్రభుత్వం కలిసి పనిచేసేలా ఈ టీమ్ వ్యవహరించనుంది. AI రంగం పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ కంటే కూడా పెద్ద మార్పును తీసుకురాగలదని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే ఈ రంగంలో అమెరికా ప్రపంచంలో ముందుండాలని, అమెరికన్ల ప్రయోజనాలను కాపాడుతూ వారి జీవితాలను మెరుగుపరిచేలా AIని ఉపయోగించాలనేది ఈ కొత్త బృందం లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇక AI విషయంలో అమెరికా, చైనా మధ్య పోటీ కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా కనిపిస్తోంది. AI అభివృద్ధిని అమెరికా నెమ్మదిస్తే చైనాకు అవకాశం దొరికే ప్రమాదం ఉందని ట్రంప్ గతంలో హెచ్చరించారు. AI రంగంలో ముందుండటం అమెరికా భద్రత, ప్రయోజనాలకు ముఖ్యమని ఆయన ప్రభుత్వం చెబుతోంది. జే క్లేటన్‌ను ఈ బాధ్యతకు ఎంపిక చేయడం కూడా కీలకంగా మారింది. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో క్లేటన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన మాన్‌హాటన్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు AI రంగంలో ప్రభుత్వ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ట్రంప్ అప్పగించారు.
AI అభివృద్ధిని నెమ్మదించాలనే సూచనలను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా చైనాతో పోటీలో అమెరికా వెనుకబడకూడదంటే AI అభివృద్ధిని కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల వైట్‌హౌస్‌లో ప్రముఖ AI కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్.. AI కంపెనీలు తమ టెక్నాలజీని తామే పర్యవేక్షించుకునేలా ఒక స్వచ్ఛంద ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ ఏర్పాటు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా AI రంగంలో ఎదురయ్యే అవకాశాలు, ప్రమాదాలను అంచనా వేయడంతో పాటు, దేశం ఈ టెక్నాలజీలో ముందంజలో ఉండేలా ప్రభుత్వ చర్యలను సమన్వయం చేయడం ఈ బృందం ప్రధాన పని కానుంది. జే క్లేటన్ కూడా AI రంగంలో అమెరికా ముందుండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. AIలో మొదటి స్థానంలో లేకపోతే అమెరికాకు తెలియని, తెలిసిన అనేక రకాల ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ముందుండటం వల్ల ఆ ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.









