Pilot Abhinandan Varthaman : భారత వైమానిక దళంలో 22 ఏళ్ల పాటు సేవలందించిన ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్తమాన్ ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇకపై కమర్షియల్ పైలట్‌గా కొత్త కెరీర్ ప్రారంభించినున్నారు. 2019లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన వైమానిక పోరులో అభినందన్ ఎంతో కీలకంగా నిలిచారు. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చిన తర్వాత ఆయన ప్రయాణిస్తున్న MiG-21 బైసన్ కూడా కూలిపోయింది. దీంతో అభినందన్ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి సైన్యానికి చిక్కారు.

అభినందన్‌ను పాకిస్థాన్ మూడు రోజుల పాటు బందీగా ఉంచింది. ఆ తర్వాత 2019 మార్చి 1 రాత్రి ఆయనను భారత్‌కు అప్పగించింది. విమానం నుంచి బయటకు దూకే సమయంలో ఆయనకు గాయాలయ్యాయి. తాజాగా అభినందన్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ముందస్తు రిటైర్మెంట్ తీసుకుని గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో పైలట్‌గా చేరారు.

అయితే అభినందన్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. FLY91 కూడా తమ ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమని తెలిపింది. 2024 మార్చిలో విమాన సేవలను ప్రారంభించిన FLY91 ప్రస్తుతం ఆరు ATR 72-600 విమానాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గోవా, హైదరాబాద్ ఈ సంస్థకు రెండు ప్రధాన బేస్‌లుగా ఉన్నాయి.

Also Read : జమ్మూ సరిహద్దులో పాక్ చొరబాటుదారుడు అరెస్ట్

2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన శిక్షణ శిబిరంపై వైమానిక దాడులు చేసింది. దీనికి మరుసటి రోజు పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ భారత్‌పై దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

అదే సమయంలో వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్ వర్తమాన్ MiG-21 బైసన్‌తో పాక్ యుద్ధ విమానాలను ఎదుర్కొన్నారు. ఈ వైమానిక పోరులో పాకిస్థాన్‌కు చెందిన F-16ను కూల్చినట్లు భారత్ తెలిపింది. అనంతరం అభినందన్ విమానం కూడా కూలిపోయింది. పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిన ఆయన అక్కడి సైన్యానికి చిక్కారు. మూడు రోజుల తర్వాత పాకిస్థాన్ ఆయనను విడుదల చేసింది. ఈ ఘటనతో అభినందన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.

అభినందన్ ధైర్యసాహసాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అదే ఏడాది ఆయనకు ‘వీర్ చక్ర’ పురస్కారం అందించింది. యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత ధైర్య పురస్కారాల్లో ఇది మూడోది. వైమానిక పోరులో ఆయన అసాధారణమైన విధి నిర్వహణను ప్రదర్శించినట్లు అవార్డు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు 22 ఏళ్ల ఎయిర్‌ఫోర్స్ సేవలకు వీడ్కోలు పలికిన అభినందన్.. కమర్షియల్ పైలట్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.

Also Read : నేపాల్‌ను ముంచేసిన వరద.. ఉసేన్ బోల్ట్ కూడా తప్పించుకోలేడట!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.