
Jammu and Kashmir : జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ పాకిస్థాన్ చొరబాటుదారుడిని బీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. కనాచక్ సెక్టార్‌లోని బోర్డర్ ఔట్‌పోస్ట్ సోహన్ సమీపంలో 44వ బెటాలియన్‌కు చెందిన అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వ్యక్తిని పాకిస్థాన్‌లోని సియాల్కోట్ జిల్లా లూని గ్రామానికి చెందిన నజీర్‌గా గుర్తించారు. కనాచక్-ఆర్‌ఎస్ పురా ప్రాంతానికి ఎదురుగా పాకిస్థాన్ వైపు లూని గ్రామం ఉంది.
నజీర్‌ను అదుపులోకి తీసుకున్న వెంటనే బీఎస్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించేందుకు సంబంధిత డీఐజీ కూడా అక్కడికి చేరుకున్నారు. నజీర్ సరిహద్దును పొరపాటున దాటాడా? లేక ఉద్దేశపూర్వకంగానే భారత భూభాగంలోకి వచ్చాడా? అనే కోణంలో బీఎస్ఎఫ్ అధికారులు విచారిస్తున్నారు. సరిహద్దులో భద్రతా బలగాల అప్రమత్తతను పరీక్షించేందుకు అతడిని పంపించారా అనే కోణంలోనూ ప్రశ్నిస్తున్నారు.
Also Read : పాక్ జెట్‌ను కూల్చిన అభినందన్ ముందస్తు రిటైర్మెంట్!
జమ్మూ అంతర్జాతీయ సరిహద్దులో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గత కొన్ని నెలల్లో పలు సందర్భాల్లో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా బీఎస్ఎఫ్ వారిని గుర్తించింది.మార్చి 25న సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో భల్లేర్ బోర్డర్ ఔట్‌పోస్ట్ ఎదురుగా ఓ వృద్ధ పాకిస్థాన్ పౌరుడిని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. బీఎస్ఎఫ్ సిబ్బంది హెచ్చరించడంతో అతడు లొంగిపోయాడు. ప్రాథమిక విచారణలో పొరపాటున సరిహద్దు దాటినట్లు తేలింది. తర్వాత అధికారిక ప్రక్రియ పూర్తి చేసి అతడిని పాకిస్థాన్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముందు కూడా రామ్‌గఢ్ సెక్టార్‌లో ఓ ఘటన జరిగింది. లాహోర్‌కు చెందిన 61 ఏళ్ల మహ్మద్ ఆరిఫ్ సరిహద్దు కంచె వైపు వేగంగా రావడంతో బీఎస్ఎఫ్ పలుమార్లు హెచ్చరించింది. అయినా అతడు పట్టించుకోకపోవడంతో బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక గతంలో ఆర్నియా సెక్టార్‌లో కంచె వైపు దూసుకొచ్చిన మరో చొరబాటుదారుడిని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. మరో ఘటనలో రామ్‌గఢ్ సెక్టార్‌లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. అతడి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
Also Read : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. 12 మంది మృతి..









