ISRO: ఇస్రోలో పెరుగుతున్న రాజీనామాల పరంపరను అడ్డుకోవడానికి కేంద్ర అంతరిక్ష శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గగన్‌యాన్ వంటి దేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో, వారిని ఆపేందుకు అధికారులు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చారు. ఈ మేరకు జూలై 14న ఒక అంతర్గత మెమో జారీ చేయబడింది. ఇప్పటి వరకు ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకు ఉన్న రాజీనామాలు ఆమోదించే అధికారాన్ని ఇప్పుడు కేంద్ర అంతరిక్ష శాఖ తన చేతుల్లోకి తీసుకుంది. ఇకపై గగన్‌యాన్ లేదా ఇతర అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఉన్న గ్రూప్-ఏ శాస్త్రవేత్తలు రాజీనామా చేయాలన్నా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ కోరాలన్నా, ఆ ఫైళ్లు నేరుగా అంతరిక్ష శాఖకే పంపబడతాయి. వారు అనుమతిస్తేనే ఆ రాజీనామా ఆమోదం పొందుతుంది.

Also Read : మతకు మరో షాక్.. నటి రాజీనామా!

గత కొద్ది కాలంగా ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు భారీగా బయటకు వెళ్ళిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారికంగా ఈ సంఖ్యను వెల్లడించకపోయినా, దాదాపు 100 నుండి 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుండి 80 మంది, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి 20 మంది వరకు బయటకు వచ్చేశారు. ఇందులో ఎల్వీఎం3 ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, స్పేడెక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్, చంద్రయాన్-3 విజయంలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య రాళ్లపల్లి వంటి ఉన్నత స్థాయి అధికారులు ఉండటం గమనార్హం. దాదాపు లక్షకు పైగా సిమ్యులేషన్స్ ద్వారా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను విజయవంతం చేయడంలో ఆదిత్య రాళ్లపల్లి కీలక సేవలందించారు.

వాస్తవానికి ఇస్రోలో 14,600 మందికి పైగా పనిచేస్తున్నప్పటికీ, ఈ 100-120 మంది వెళ్లిపోవడం పెద్ద సమస్యేనని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే వీరు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, గగన్‌యాన్, చంద్రయాన్ వంటి సంక్లిష్టమైన ప్రాజెక్టులపై ఎంతో అనుభవం ఉన్న నిపుణులు. కొత్త వారిని తీసుకోవడం సులభమే కానీ, ఇలాంటి కీలక శాస్త్రవేత్తల స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం చాలా కష్టమని ఇస్రో వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో నవంబర్ 2020లో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం, రాజీనామాలు ఆమోదించే అధికారం కేంద్రాల డైరెక్టర్లకే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తీవ్రతను బట్టి, అంతరిక్ష శాఖ మళ్ళీ పాత పద్ధతిని మార్చి, కేంద్రం నుండే అనుమతులు తీసుకోవాలని కఠిన నిబంధన విధించింది. ప్రస్తుతం ఇస్రోలో 1,050కి పైగా ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read : లంచం తీసుకుంటూ దొరికిపోయింది.. పారిపోతుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.