
Gold Prices Hikes: రోజురోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే పసిడి విషయంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ‘స్వర్ణిమ్ ఉడాన్ 2047’ నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భారత్‌లో బంగారాన్ని ఒక సాధారణ లోహంగా కాకుండా, లిథియం లేదా యురేనియం వంటి వ్యూహాత్మక ఖనిజంగా అధికారికంగా గుర్తించాలని WGC ప్రభుత్వాన్ని కోరింది.
Also Read : పుట్టుక, చావుల రిజిస్ట్రేషన్లపై మోదీ సర్కార్ కఠిన నిబంధనలు.. పార్లమెంట్‌లో బిల్లు పాస్!
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బంగారానికి ఈ ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో కొత్త పసిడి గనుల తవ్వకానికి అనుమతులు చాలా వేగంగా లభిస్తాయి. సాధారణంగా మైనింగ్ చేయడానికి పర్యావరణ, అటవీ శాఖల నుంచి రకరకాల పర్మిషన్లు తెచ్చుకోవడం కష్టం. కానీ ఈ హోదా వస్తే మాత్రం ‘సింగిల్ విండో’ విధానంలో కేంద్రం నుంచే నేరుగా అనుమతులు తొందరగా వచ్చేస్తాయి. అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. మనదేశంలో తవ్వకాలకు తగినంత నాణ్యమైన బంగారం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక టన్ను మట్టిని తవ్వితే కనీసం 2 గ్రాముల బంగారం రావడం కూడా అత్యంత కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గనుల నుంచి పసిడి తీయడానికి అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. దానికి తోడు ప్రభుత్వమే బంగారానికి ‘వ్యూహాత్మక హోదా’ ఇస్తే దాని బ్రాండ్ విలువ మరింత పెరిగి, మార్కెట్లో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే కనుక జరిగితే సామాన్యులు బంగారం కొనడం ఇక కష్టమే.
మన దేశానికి ప్రతి ఏటా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం బయటకు పోతోంది. దీనివల్ల దేశ కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతోంది. ఈ దిగుమతుల భారాన్ని తగ్గించడానికి, మన భారతీయుల ఇళ్లల్లో నిరుపయోగంగా దాచి ఉంచిన పసిడిని బయటకు తీసుకురావాలని WGC ప్లాన్ చేస్తోంది. మన ఇళ్లలో ఉన్న మొత్తం బంగారంలో ప్రతి సంవత్సరం కేవలం 1 శాతం పసిడిని స్కీమ్‌ల ద్వారా నగదుగా మార్చినట్లయితే.. దేశానికి దాదాపు రూ. 3.1 లక్షల కోట్ల విలువైన భారీ బంగారం దిగుమతులను ఆపే అవకాశం ఉందని WGC తెలిపింది.
Also Read : ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పన్నీర్ బ్యాన్.. అమ్మితే లక్ష రూపాయలు ఫైన్!









