
IndiGo Flight : కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఒక ప్రైవేట్ విమానంలో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు ఇంజిన్ లోపం తలెత్తడంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. ఇంజిన్ విఫలమైనప్పటికీ పైలట్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా నేలదించడంతో భారీ ప్రమాదం తప్పి, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : బాలి సమీపంలో ఫెర్రీలో అగ్నిప్రమాదం… స్పాట్ లో 131 మంది?
ఇండిగో సంస్థకు చెందిన 6ఈ-723 విమానం మంగళవారం రాత్రి కోల్‌కతా నుంచి చెన్నైకి బయలుదేరింది. ప్రయాణికులు, విమాన సిబ్బందితో కలిపి మొత్తం 224 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం రాత్రి 11:30 గంటలకు చెన్నై విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే, గాల్లో ఉండగానే ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు విమానం ఎడమ వైపు ఇంజిన్ ఫెయిల్ అయినట్లుగా పైలట్ గుర్తించారు.
పరిస్థితి తీవ్రతను గ్రహించిన పైలట్ వెంటనే చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు మంగళవారం రాత్రి 11:29 గంటలకు విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తూ తక్షణ రక్షణ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు, అత్యవసర వైద్య బృందాలు రన్‌వే సమీపానికి చేరుకుని సిద్ధంగా నిలిచాయి.
పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి రాత్రి 11:37 గంటలకు విమానాన్ని రన్‌వే 25 పై సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 224 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వలన విమానాశ్రయంలో ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగలేదని, సేవలన్నీ యథావిధిగా కొనసాగాయని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఇంజిన్ లోపానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుపుతోంది.
Also Read : పాకిస్తాన్‌పై తిరుగుబాటు.. కొత్త దేశంగా బలూచిస్థాన్..!









