CJP Delhi Protest
CJP Delhi Protest

ముంబైలో మొదలైన ఆందోళన.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వైపు అడుగులు వేస్తోంది. అక్టోబర్ 2న ముంబైలో శివాజీ పార్క్ వేదికగా వేలాది మంది యువతతో నిరసన చేపట్టిన CJP.. ఇప్పుడు అక్టోబర్ 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మరో భారీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అదీ.. “జంతర్ మంతర్ 2.0” పేరుతో! ప్రధాన డిమాండ్ ఒక్కటే… చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని. ఆయన రాజీనామా చేయకపోతే దేశం నలుమూలల నుంచి యువత ఢిల్లీకి రావాలని CJP చీఫ్ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. అంటే ముంబైతో ముగిసిన కథ కాదు.. ఢిల్లీతో మరో అధ్యాయం మొదలవుతోంది.

అసలు ఈ నిరసన వెనుక ఉన్న వివాదం ఏంటి?, ఎందుకు CJP నేరుగా CEC జ్ఞానేశ్ కుమార్‌నే టార్గెట్ చేస్తోంది?, కథంతా Special Intensive Revision… అంటే SIR చుట్టూనే తిరుగుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని CJP ఆరోపిస్తోంది. ఓటర్ లిస్ట్‌ నుంచి అర్హుల పేర్లు తొలగించారని CJP వాదిస్తోంది. ఇదే అంశంపై జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇవన్నీ CJP చేస్తున్న ఆరోపణలు మాత్రమే. ఎన్నికల సంఘం మాత్రం SIRకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు కమిషన్ ఏకగ్రీవంగా తీసుకున్నాయని, SIR ఉద్దేశం ఓటర్ల జాబితాలను సరిచేయడమేనని చెబుతోంది. అందుకే ఇప్పుడు ఇది కేవలం ఒక నిరసన ఇష్యూ కాదు. ఎన్నికల వ్యవస్థపై నమ్మకం, ఓటర్ల జాబితా పారదర్శకత అనే పెద్ద చర్చగా మారుతోంది.

ముంబైలో CJP నిరసన కార్యక్రమం సాదాసీదాగా సాగలేదు. శివాజీ పార్క్ దగ్గర నిరసకు పోలీసులు నో పర్మిషన్ ఇచ్చినా ఆందోళనకారులు అక్కడికి ఉవ్వెత్తున చేరుకున్నారు. యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నినాదాలు హోరెత్తాయి. సినీ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా CJP నిరసనలో పాల్గొన్నారు. అయితే, CJP నాయకత్వం తమ పోరాటం శాంతియుతమని చెబుతోంది. మహాత్మా చూపిన అహింసా మార్గంలోనే ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించింది. మరోవైపు, ముంబై పోలీసులు ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడంపై గుర్రుగా ఉన్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని, భారీ లౌడ్‌స్పీకర్లతో రోడ్డుపై ఇబ్బంది వాతావరణాన్ని క్రియేట్‌ చేశారని కేసు నమోదు చేశారు. అంటే… ఉద్యమం చేపట్టిన సీజేపీకి ఇదొక రాజకీయ సవాల్ మాత్రమే కాదు… చట్టపరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.

మొత్తానికి, ముంబైలో ఆందోళన పూర్తయింది. ఇప్పుడు CJP ఫోకస్‌ దేశరాజధాని ఢిల్లీకి మళ్లింది. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని అభిజీత్‌ దీప్కే నిర్ణయించారు. దేశంలోని యువత అంతా ఆరోజు ఢిల్లీకి రావాలని CJP పిలుపునిచ్చింది. “జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కాక్రోచులు ఢిల్లీకి వస్తారు” అంటూ అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ఆ రోజు పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే.. తమ నిరసన వేదిక అవుతుందని దీప్కే స్పష్టంచేశారు.
అందుకే, అక్టోబర్ 10 కార్యక్రమం చుట్టూ భద్రతా ఏర్పాట్లు, అనుమతులు, జన సమీకరణ…
ఇవన్నీ కీలకంగా మారబోతున్నాయి.

ఈ స్టోరీలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. CJP నిరసన కేవలం ఒక నగరానికే పరిమితం కావడంలేదు. ముంబై తర్వాత గోవా, కోల్‌కతా, పాట్నా, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఆందోళనలు చేపడతామని CJP నాయకత్వం అనౌన్స్ చేసింది. అంటే ముంబైలో జరిగిన ఆందోళన కార్యక్రమం.. క్రమక్రమంగా దేశవ్యాప్తంగా యువతను కలిపే ఉద్యమంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. CJP నాయకత్వం Gen Zను తమ ఉద్యమంలో మెయిన్ పవర్‌గా చూస్తోంది. యువతను పెద్ద ఎత్తున సమీకరించి ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడమే తమ లక్ష్యమని చెబుతోంది.

అయితే, ఢిల్లీలో ఇప్పటికే సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్‌గా మారిపోయింది. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో.. అక్టోబర్ 2, 3 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల్లో ఢిల్లీ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం,
నిరసనలకు సంబంధించి మూడు FIRలు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందికి అడ్డంకులు కల్పించడం వంటి ఆరోపణలు అందులో ఉన్నాయి. ఇదిలాఉండగానే, నాలుగైదు రోజుల్లో చేపట్టే ఉద్యమానికి… ఢిల్లీకి పెద్దఎత్తున చేరే అవకాశం ఉందని CJP అనౌన్స్ చేసింది. అందుకే, అక్టోబర్ 10న నిరసన కార్యక్రమం కంటే.. దాన్ని పోలీసులు ఎలా కంట్రోల్‌ చేస్తారన్నది కీలకంగా మారుతోంది.

ఇక్కడ ఒక విషయం క్లియర్‌గా గుర్తుంచుకోవాలి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ CJPది.
ఎన్నికల సంఘం మాత్రం సీజేపీ చేస్తోన్న ఆరోపణలను ఖండిస్తోంది. SIRకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు పూర్తిగా కమిషన్ ఏకగ్రీవమని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇదే సమయంలో SIRలో కొన్ని నిర్ణయాలపై.. ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు కూడా అభ్యంతరం చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఇదే అంశాన్ని సీజేపీ తమ ఆరోపణలకు ప్రధాన కారణంగా చూపిస్తోంది.

ఇక్కడ CJP డిమాండ్‌ సీఈసీ రాజీనామా మాత్రమే కాదు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని,
SIRను రద్దు చేసి 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఉన్న ఓటర్ల జాబితాలను పునరుద్ధరించాలని, ఎన్నికల చట్టాల్లో చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అందుకే, అక్టోబర్ 10 కార్యక్రమం కేవలం CEC రాజీనామా కోసం మాత్రమే కాదు. ఓటర్ల జాబితాలు, ఎన్నికల విధానం, ఎన్నికల సంఘం బాధ్యతలపై కూడా పెద్ద చర్చ జరగాలన్నది సీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఇక, సీజేపీ ఉద్యమానికి వస్తున్న మద్దతు కూడా పెద్ద చర్చకు దారితీసింది. ముంబైలో జరిగిన కార్యక్రమానికి యువతతో పాటు కొందరు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. షబానా ఆజ్మీ, విశాల్ దద్లానీ, నసీరుద్దీన్ షా, ప్రకాశ్ రాజ్ వంటివారు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. అదే సమయంలో సీజేపీపై విమర్శలు సైతం వస్తున్నాయి. సీజేపీని పొలిటికల్‌గా ఎలా చూడాలి, దాని ఉద్యమం ఏ స్థాయికి వెళ్తుంది అనే చర్చ కూడా మొదలైంది.

ఇప్పుడు అసలు కౌంట్‌డౌన్ మొదలైంది. అక్టోబర్ 10కి ఇంకా నాలుగైదు రోజులే ఉన్నాయి. ఈలోపు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తారా ?. CJP మాత్రం ఆయన రాజీనామాపై తగ్గేదే లేదు అంటోంది. మరి ఈ లోపు సీఈసీ రాజీనామా జరగకపోతే.. అక్టోబర్ 10న ఢిల్లీకి ఏ స్థాయిలో తరలివస్తారు? జంతర్ మంతర్ నిరసనకు పోలీసులు అనుమతి ఇస్తారా? అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తే ఆ రోజు ఢిల్లీ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ అక్టోబర్ 10కి ముందే తేలాల్సిన విషయాలు.

అయితే మనం ఇక్కడో విషయం గమనించాలి. CJP చెప్పినట్టుగా దేశ నలుమూలల నుంచి Gen Z పెద్దఎత్తున ఢిల్లీ చేరితే, ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ఎంత స్పందన వస్తుందన్నది కీలకంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే CJP నిరసన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ప్రతి వీడియో ప్రస్తుత నిరసనకు సంబంధించి కాదు. 2024 నాటి వీడియోలు 2026 నిరసనలకు లింక్‌ చేస్తూ వైరల్ చేశారని ఫ్యాక్ట్ చెక్‌లు వెల్లడించాయి. అందుకే అక్టోబర్ 10న వచ్చే ప్రతి వీడియో, ప్రతి ఇన్‌ఫర్మేషన్‌ను ముందుగా చెక్ చేసి.. అది నిజమో కాదో నిర్ధారించుకోవాలి.

మొత్తంగా చూస్తే CJP ఉద్యమం మూడు దశల్లో ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తోంది. మొదట… ముంబైలో బహిరంగ నిరసన. రెండోది… దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద కార్యక్రమానికి పిలుపు. మూడోది… ఇతర రాష్ట్రాల్లో కూడా నిరసన గళం వినిపించే ప్రయత్నం. ఈ మూడు విషయాలు కలిపి చూస్తే… అక్టోబర్ 10.. ఉద్యమానికి టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా CJP ఉద్యమానికి ఎంత బలముందో అక్టోబర్ 10న తేలనుంది.

అయితే ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడాలంటే జనసమీకరణ ఒక్కటే సరిపోదు. ఆ ఉద్యమం లేవనెత్తిన ఆరోపణలకు ఆధారాలు ఏంటి? ఎన్నికల సంఘం ఇచ్చే సమాధానం ఏంటి? ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది? కోర్టుల్లో ఈ వివాదం ఎలా ముందుకు వెళ్తుంది? ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఎన్నికల్లో ఏదైనా తప్పు జరిగిందన్న ఆరోపణలు వస్తే… దాని ప్రభావం ప్రజల నమ్మకంపై పడుతుంది. అందుకే ఈ విషయంలో పొలిటికల్ కామెంట్స్ కంటే… నిజాలు ఏంటి? ఆధారాలు ఏంటి?
అఫీషియల్ రికార్డ్స్‌ ఏం చెబుతున్నాయి? అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్.

కానీ ఒక విషయం మాత్రం క్లియర్‌.. ముంబైలో వినిపించిన నినాదాలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. ముంబైలో మొదలైన ఆందోళన… దేశరాజధానిలో మరో పరీక్షకు సిద్ధమవుతోంది. అందుకే, అక్టోబర్ 10న ఢిల్లీలో ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం… దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపూ జంతర్ మంతర్ వైపే ఉంది.