Ahmedabad : గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగర శివారులో శనివారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రామోల్-గాత్రాడ్ రోడ్ కెనాల్ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో నడుస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ భీకర పేలుడు ధాటికి ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మొదట ఇద్దరు మాత్రమే మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ, సహాయక చర్యలు ముమ్మరం చేసే కొద్దీ శిథిలాల కింద మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు భారీ సంఖ్యలో ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి. తీవ్రంగా గాయపడిన కార్మికులను శిథిలాల నుంచి వెలికితీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఎల్జీ , సివిల్ ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుండటంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : నింగి నుంచి నేరుగా కరెంట్: భవిష్యత్ ఇంధన ముఖచిత్రాన్ని మార్చనున్న ‘స్పేస్ పవర్ బీమింగ్’

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఈ పటాకుల తయారీ కేంద్రాన్ని మేహుల్ దొడియా అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా సదరు ఫ్యాక్టరీ లైసెన్స్‌ను అధికారులు ఇదివరకే రద్దు చేసినప్పటికీ, నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తూ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా పటాకుల తయారీ సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. నివాస ప్రాంతాలకు సమీపంలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఈ యూనిట్‌ను నడపడం వల్లే ఇంతటి భారీ ప్రాణనష్టం సంభవించింది.

ఫైర్ ఇంజన్లు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రక్షణ అధికారులు వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. పేలుడు సంభవించడానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి, అలాగే అక్కడ నిల్వ ఉంచిన రసాయనాల నాణ్యతను, భద్రతా ఉల్లంఘనలను శాస్త్రీయంగా పరిశీలించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నిపుణుల బృందాలను ఘటనా స్థలానికి రప్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Also Read : విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర… TVK MLAలకు రూ. 35 కోట్ల ఆశ!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.