Honey-Trap : భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)కు చెందిన ఒక వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం సంచలనంగా మారింది. రెండు నెలల క్రితం (మే 31 రాత్రి) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ అందించిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు మే 31వ తేదీ రాత్రి ఈ వింగ్ కమాండర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో పాకిస్థానీ హ్యాండ్లర్లతో సంబంధం ఉన్నట్లు ఆరోపించబడుతున్న హనీట్రాప్ నెట్‌వర్క్ కోణం కూడా బయటపడింది. సున్నితమైన రక్షణ సమాచారం లీక్ చేసిన కేసులో ఈ వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act) కింద కేసు నమోదు చేసి ఆయనను జైలుకు పంపారు. ఇది ఒక పెద్ద గూఢచారి నెట్‌వర్క్‌లో భాగం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. IAF ఇంటెలిజెన్స్ వింగ్ ఈ సమాచారాన్ని పోలీసులకు అందించింది. జాతీయ రక్షణకు సంబంధించిన గోప్యమైన పత్రాలు, సమాచారాన్ని ఆ అధికారి విదేశీయులతో పంచుకున్నారని వారు ఆరోపించారు. ఆయనపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయనను మొదట పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ అనంతరం తీహార్ జైలుకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Also Read : నాపై ఆంక్షలు విధించడానికి మీరెవరు? పోలీసులపై అభిజిత్‌ దీప్కే ఫైర్‌

వింగ్ కమాండర్ కు వలపు వల

వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న ఆ అధికారితో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ పరిచయం పెంచుకున్నట్లు తేలింది. ఆ తర్వాత వారి మధ్య చాటింగ్‌లు, వీడియో కాల్స్ మొదలయ్యాయి. ఆ మహిళ క్రమంగా ఆయన నమ్మకాన్ని చూరగొని, సైనిక దళాల కదలికలు, మోహరింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పాటు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తేలింది. ఆఫీసర్ కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారా అవసరమైన పత్రాలను, డేటాను ఆమెకు పంపిచాడు. కేవలం సమాచారంతో సరిపెట్టకుండా, తన సహోద్యోగి ఫోన్‌లో ఒక ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా ఆ మహిళ ఆ వింగ్ కమాండర్‌ను కోరింది. అది డేటాను దొంగిలించే స్పైవేర్ లేదా రిమోట్ యాక్సెస్ మాల్‌వేర్ అని అధికారులు గుర్తించారు. దీని ద్వారా ఫోన్ లొకేషన్, డివైస్ డేటా, సంభాషణలను ట్రాప్ చేయడం వీలయింది.

ఈ మొత్తం ఆపరేషన్ వెనుక పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లు ఉన్నట్లు నిఘా వర్గాలు, పోలీసులు భావిస్తున్నారు. వ్యూహాత్మక సైనిక గూఢచార సమాచారాన్ని రాబట్టడానికి పాకిస్థాన్ ఏజెన్సీలు రచిస్తున్న పెద్ద గూఢచార నెట్‌వర్క్‌లో ఇది భాగమని దర్యాప్తులో వెల్లడైంది.

కాగా, నిందితుడు షేర్ చేసిన సమాచారం వల్ల జాతీయ భద్రతకు ఎంత నష్టం వాటిల్లింది? ఈ నెట్‌వర్క్‌లో ఇంకెవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణంలో డిజిటల్ ట్రైల్ ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇది రక్షణ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న హనీట్రాప్ మాడ్యూళ్లను సూచిస్తోందని, దీనిలో సోషల్ మీడియా ద్వారా నమ్మకం సంపాదించి గోప్యమైన సమాచారాన్ని రాబడతారని అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : కన్వర్ యాత్రకు చెడ్డపేరు తెచ్చేదెవరు ?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.