బిజీగా ఉండే రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ ఎదురైంది. రోజూ బ్రాండెడ్ ప్రొడక్ట్స్, ఆకర్షణీయమైన కమర్షియల్ యాడ్స్ ప్రదర్శించే డిజిటల్ బిల్‌బోర్డులపై సడెన్‌గా పోర్న్ వీడియోలు ప్లే అయ్యాయి. ఏదో ఒక చోట కాదు.. ఏకంగా 5 దేశాల్లో ఒకేసారి ఈ వింత ఘటన జరగడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

Also Read : అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్స్ ఓడిపోతే.. వీటో వాడుతాన్న ట్రంప్

అసలేం జరిగింది?

ఈజిప్ట్‌, మలేషియా, బ్రెజిల్, చైనా, ఇరాక్ దేశాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్లను సైబర్ హ్యాకర్లు హైజాక్ చేశారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని అత్యంత రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై బిల్‌బోర్డ్‌లో అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షమవ్వడంతో జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రోడ్డుపై వెళ్లేవారు ఆ దృశ్యాలను తమ స్మార్ట్‌ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారి ఇంటర్నేషనల్ మీడియా దృష్టికి వెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలు, స్థానిక అధికారులు ఆ స్క్రీన్లను స్విచ్ఛాఫ్ చేశారు.

సిస్టమ్ లోపాలను క్యాష్ చేసుకున్న హ్యాకర్లు

బిల్‌బోర్డులకు కంటెంట్ అందించే అడ్వర్టైజింగ్ కంపెనీ వెబ్‌సైట్‌పై సైబర్ ఎటాక్ జరిగిందని, దీనివల్లే ఒకే టైమ్‌లో పలు దేశాల్లో ఈ అనధికారిక ఫుటేజీ టెలికాస్ట్ అయిందని ఈజిప్ట్‌ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది. కాగా, ఈ సైబర్ దాడికి తామే కారణమని ‘Leakers$’ అనే హ్యాకర్ల గ్రూప్ టెలిగ్రామ్ వేదికగా ప్రకటించుకుంది.

ఎల్‌ఈడీ స్క్రీన్లకు డేటాను, కంటెంట్‌ను ప్రసారం చేసే సాఫ్ట్‌వేర్‌లో ఉన్న సెక్యూరిటీ లోపాలను కనిపెట్టడానికి తమకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే పట్టిందని వారు వెల్లడించారు.

Also Read : సైరన్ మోగింది.. అణు బాంబు వస్తోంది.. రష్యాను ఊపేసిన బిగ్గెస్ట్ సైబర్ ట్విస్ట్!

డబ్బు కోసం కాదు.. భద్రతను ఎగతాళి చేయడానికే!

సాధారణంగా సైబర్ నేరగాళ్లు డబ్బు కోసమో, రాన్సమ్‌వేర్ డిమాండ్ల కోసమో హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు. కానీ ఈ ఘటనలో తమ ఉద్దేశం అది కాదని హ్యాకర్లు స్పష్టం చేయడం గమనార్హం. కేవలం యాడ్ ఏజెన్సీలు, టెక్ కంపెనీల సెక్యూరిటీ వ్యవస్థను ఎగతాళి చేయడానికే ఈ పని చేశామని వారు తెలిపారు.

లక్షల డాలర్లు ఖర్చు పెట్టి భారీ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసుకుంటున్న సంస్థలు.. ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉన్న స్క్రీన్లకు కనీస భద్రతను కూడా కల్పించలేకపోతున్నాయని హ్యాకర్లు ఎద్దేవా చేశారు. సరైన సెక్యూరిటీ మెజర్స్ లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఉన్న స్క్రీన్‌నైనా సులభంగా హ్యాక్ చేయగలమని చూపించడమే తమ టార్గెట్ అని వారు పేర్కొన్నారు.

ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఉలిక్కిపడ్డాయి. ఇంటర్నెట్ ఆధారిత అవుట్‌డోర్ డిస్‌ప్లేల సైబర్ సెక్యూరిటీపై వెంటనే దృష్టి సారించకపోతే ఇలాంటి ఇబ్బందికర పరిణామాలు మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.