LPG Cylinder Price Hikes
LPG Cylinder Price Hikes

LPG e-KYC : ఇంటి అవసరాలకు వినియోగించే ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు ఆయా చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని, లేనిపక్షంలో సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తామని వార్నింగ్‌ ఇచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తిచేయడానికి ఈ నెల 16వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తుది గడువుకు వారం రోజుల ముందే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ నిబంధనను అనధికారికంగా అమల్లోకి తెచ్చారు. ఫలితంగా వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతున్నప్పటికీ..ఇంటికి డెలివరీ చేసే సమయంలో ఈ-కేవైసీ కాలేదనే నెపంతో డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్‌ సరాఫరాను ఆపేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.3 కోట్లకు పైగా గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. సాధారణంగా ప్రతిరోజూ రీఫిల్లింగ్ కోసం సగటున 2 లక్షల బుకింగ్‌లు వస్తుంటాయి. కానీ, ప్రస్తుతం రోజుకు 1.7 లక్షల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిపోతున్న దాదాపు 30 వేల సిలిండర్లలో మెజారిటీ రీఫిల్‌లు ఈ-కేవైసీ పూర్తికానీవేనని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇంకా సుమారు 26 లక్షల కనెక్షన్లకు (మొత్తం కనెక్షన్లలో దాదాపు 20% పైగా) ఈ-కేవైసీ పూర్తి కావాల్సి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

అందుకే వినియోగదారులు గ్యాస్ సబ్సిడీ, గృహ వినియోగ ధరల ప్రయోజనాలు కొనసాగాలంటే ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులు కూడా సమయానికి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. లేదంటే ఎల్‌పీజీ సబ్సిడీ పొందడంలో అంతరాయం ఎదుర్కొనే అవకాశం ఉంది.

Also Read : అరుణాచల్‌ కు పొంచి ఉన్న ముప్పు?

ఇండేన్ గ్యాస్: ఇండేన్ వినియోగదారులు ఇంటి నుంచే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ (ఈ-కేవైసీ) పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి. దీన్ని మొబైల్ ఫోన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం రెండు యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొదటిది ‘ఇండియన్ ఆయిల్ వన్’ యాప్. రెండవది ‘ఆధార్‌ఫేస్‌ఆర్‌డీ’ యాప్. ఇవి ఫేస్ స్కాన్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం ఉపయోగపడుతాయి. ముందుగా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ఓపెన్ చేసి, రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో సైన్ అప్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత ‘లింక్ మై ఎల్‌పీజీ ఐడీ’పై క్లిక్ చేసి 16 అంకెల ఎల్‌పీజీ ఐడీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఐడీ అనేది క్యాష్ మెమో లేదా సబ్‌స్క్రిప్షన్ వోచర్‌పై ఉంటుంది. తర్వాత హోమ్ స్క్రీన్‌లో ఉన్న ‘మై ప్రొఫైల్’ విభాగానికి వెళ్లి, ఎల్‌పీజీ విభాగంలో ‘ఇండేన్ డీటెయిల్స్’ ఎంపికను ఓపెన్‌ చేయాలి. అక్కడ ‘రీ-కేవైసీ’పై క్లిక్ చేసి నిబంధనలు, షరతులను అంగీకరించాలి. ఆ తర్వాత ‘ప్రొసీడ్’పై క్లిక్ చేసి ‘ఫేస్ స్కాన్’ ఎంపిక ద్వారా బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటే సరిపోతుంది.

హెచ్‌పీ గ్యాస్: ఈ-కేవైసీ కోసం హెచ్‌పీ పే యాప్, ఆధార్ ఫేస్‌ఆర్‌డీ యాప్ అనే రెండు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఫేస్ స్కాన్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి. ముందుగా హెచ్‌పీ గ్యాస్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో హెచ్‌పీ పే యాప్‌లో లాగిన్ అవ్వాలి. హోమ్ స్క్రీన్‌లో ఎల్‌పీజీ విభాగానికి వెళ్లి ‘ఈ-కేవైసీ’పై క్లిక్ చేయాలి. నిబంధనలు, షరతులను అంగీకరించిన తర్వాత ‘క్యాప్చర్ ఫేస్’పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆధార్ ఫేస్‌ఆర్‌డీ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో ఫేస్ స్కాన్ పూర్తి చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి.

భారత్ గ్యాస్: భారత్ గ్యాస్ వినియోగదారులు ‘హలో బీపీసీఎల్’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందులో అడిగిన వివరాలు ఇవ్వాలి. తర్వాత ‘ఈ-కేవైసీ’ లేదా ‘బయోమెట్రిక్ ఆథెంటికేషన్’ ఎంపికపై క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. మొత్తంగా, ఎల్‌పీజీ సబ్సిడీ, గృహ వినియోగ ధరల ప్రయోజనాలు కొనసాగాలంటే వినియోగదారులు 2026 ఆగస్టు 16లోపు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. గడువును మిస్ చేస్తే సిలిండర్ బుకింగ్, సబ్సిడీ ప్రయోజనాలు నిలిచేపోయే ప్రమాదం ఉంది.

Also Read : విలీనం దిశగా ఉబర్‌ – రాపిడో అడుగులు? చివరి నిమిషంలో…

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.