Uber- Rapido : భారతదేశంలోని టాక్సీ సేవల రంగంలో రాణిస్తున్న అమెరికా రైడ్‌ హెయిలింగ్‌ సంస్థ అయిన ఉబర్‌, భారతదేశానికి చెందిన స్టార్టప్‌ కంపెనీ రాపిడో విలీనం దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఇరు సంస్థలు దేశీయంగా తమ కార్యకలాపాలను కలిసి నిర్వహించేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ, ఆ చర్చలు ఫలవంతం కాలేదు. యాజమాన్య హక్కుల విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ డీల్‌ ముందుకు సాగలేదని తెలుస్తోంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read : BSNL బంపరాఫర్.. ఉచితంగా టీవీ ఛానెళ్లు, 25 ఓటీటీలు!

అమెరికాకు చెందిన ఉబర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ దారా ఖోస్రోషాహి ఈ సంవత్సరం మే నెలలో భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. దేశంలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ ప్రణాళికలపై ఆయన వరుస సంబంధిత వర్గాలతో సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రాపిడోతో విలీనం అంశం చర్చకు వచ్చినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. క్యాబ్‌, ఆటో, బైక్‌ ట్యాక్సీ సేవలందిస్తున్న ఇరు సంస్థలు కలిసి పనిచేయాలని ఉబర్‌ సంస్థనే మొదట ప్రతిపాదించింది. దేశీయంగా తమ కార్యకలాపాలను రాపిడో సంబంధించిన మేనేజ్‌మెంటే నిర్వహించాలని ఉబర్‌ ప్రతిపాదించింది.

అయితే, రాపిడో మాత్రం దానికి అంగీకరించకుండా పూర్తి పూర్తి భిన్నమైన ప్రతిపాదనను వారి ముందుంచింది. దాన్ని బట్టి ఉబర్‌ భారత వ్యాపారాన్ని పూర్తిగా తమకు క్యాష్‌- స్టాక్‌ లావాదేవీ రూపంలో విక్రయించాలని కోరింది. అంతేకాక రాపిడోలో ఉబర్‌ మైనారిటీ వాటాదారుగా ఉండాలని ప్రతిపాదించింది. అయితే, భారత్‌లో తమ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం ఇష్టంలేని ఉబర్‌ ఇందుకు అంగీకరించలేదు. దీంతో ఒప్పందానికి బ్రేక్‌ పడినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం రెండు కంపెనీలు వేర్వేరుగా తమ కార్యకలాపాలను నిర్వహించడమే శ్రేయస్కరం అని నిర్ణయించుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ డీల్‌ కుదరక పోవడంతో రాపిడోకు పోటీగా ఉబర్ తన బైక్‌ ట్యాక్సీ సేవలను మరో 100 నగరాలకు విస్తరించింది. దీంతో మొత్తంగా 220 నగరాలకు ఉబర్‌ సేవలను విస్తరించనట్లయింది.

Also Read : అంతరిక్షంలో కంప్యూటర్లు, డేటా సెంటర్లు.. ఆకాశానికి పెద్ద ప్రమాదం!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.