
Space : ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు అంతరిక్షంలో డేటా సెంటర్లు పెట్టడానికి రెడీ అవుతున్నాయి. అయితే దీనివల్ల రాబోయే రోజుల్లో లక్షలాది కొత్త శాటిలైట్లు భూమి చుట్టూ చేరిపోతాయి. ఫలితంగా మన భూమి కూడా శని గ్రహంలా రింగులు ఉన్న గ్రహంగా మారిపోతుందని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రాత్రిపూట ఆకాశంలో వెలుతురు ఎక్కువైపోయి నక్షత్రాలు సరిగ్గా కనిపించవు. కెనడాకు చెందిన ప్రొఫెసర్ సమాంతా లావ్లర్, వారి బృందం రింగ్స్ ఇన్ ది స్కై అనే కొత్త రీసెర్చ్ ద్వారా ఈ వింత ప్రమాదాన్ని అందరికీ వివరించారు.
కంపెనీలు ప్లాన్ చేస్తున్నట్లుగా దాదాపు 10 లక్షల ఏఐ డేటా సెంటర్ శాటిలైట్లను ఆకాశంలోకి వదిలితే రాత్రిపూట ఆకాశం చూడటానికి చాలా భయంకరంగా మారుతుందని లావ్లర్ చెప్పుకొచ్చారు. టెక్ కంపెనీలకు కావాల్సింది కూడా ఇదేనని, భూమిని రింగులు ఉన్న గ్రహంగా మార్చడమే వారి ఆలోచన అని ఆయన అన్నారు. ప్రస్తుతం భూమి చుట్టూ కేవలం 16 వేల శాటిలైట్లు మాత్రమే తిరుగుతున్నాయి. కానీ స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి పెద్ద కంపెనీలు ఏకంగా 12 లక్షల శాటిలైట్లను పంపాలని చూస్తున్నాయి. ఇది ఇప్పటికంటే 75 రెట్లు ఎక్కువ. దీనివల్ల ఆకాశంలో జనం ఎక్కువైపోయి, శాటిలైట్లు ఒకదానికొకటి గుద్దుకునే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఆకాశాన్ని పరిశోధించే సైంటిస్టులకు ఏమీ సరిగ్గా కనిపించదు.
అంతరిక్షంలో డేటా సెంటర్లు పెడితే పర్యావరణానికి మంచిదని స్పేస్ ఎక్స్ కంపెనీ చెబుతోంది. భూమిపై కరెంట్ వాడకం తగ్గుతుందని, ఆకాశంలో ఉంటే ఎప్పుడూ దొరికే ఎండ ద్వారా కరెంట్ తయారు చేసుకుని ఈ కంప్యూటర్లను నడపవచ్చని భావిస్తోంది. ఆకాశంలో సూర్యకాంతి ఎప్పుడూ దొరకాలంటే, ఈ శాటిలైట్లను పగలు-రాత్రి కలిసే ఒకే వరుసలో తిప్పాలి. అలా ఒకే వరుసలో వేలాది శాటిలైట్లు తిరిగితే, భూమి చుట్టూ ఒక పెద్ద గాజుల వలయం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ డేటా సెంటర్లకు పెద్ద పెద్ద సోలార్ ప్యానెళ్లు ఉంటాయి కాబట్టి, సూర్యకాంతి వాటిపై పడి బాగా మెరుస్తాయి.
శాస్త్రవేత్తలు వేసిన లెక్కల ప్రకారం.. ఈ కంపెనీల శాటిలైట్ వలయాలు సాయంత్రం 6 గంటలకు, మళ్లీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆకాశంలో బాగా మెరుస్తూ కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. అంతరిక్షాన్ని వ్యాపారం కోసం ఇలా విపరీతంగా వాడేయడంపై అందరూ మండిపడుతున్నారు. అంతరిక్ష నిపుణుడు ప్రొఫెసర్ హ్యూ లూయిస్ మాట్లాడుతూ.. దీనివల్ల మనం రోజూ చూసే అందమైన రాత్రి ఆకాశం శాశ్వతంగా పాడైపోతుంది అని చెప్పారు.









